వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి సర్వే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లక్ష్యాన్ని చేరుకుంటోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆస్తుల నమోదు ప్రక్రియ గడువు మేర సత్ఫలితాలు సాధిస్తోంది. ప్రతి పల్లె నుంచి పట్టణం, నగరాల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు యుద్ధప్రాతిపాదికన ఆస్తుల గణన చేపట్టారు. సర్వే మొదలైనప్పుడు కొన్ని చోట్ల అనేక రకాల ఇబ్బందులు, ఆన్‌లైన్‌లో సాంకేతిక పరమైన అవరోధాలు ఎదురైనా అధిగమిస్తూ లక్ష్యం మేర ప్రక్రియ పూర్తి చేసేలా చేపట్టిన కార్యాచరణ సఫలీకృతమైంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు ఆర్.వి. కర్ణన్, ఎంవీ రెడ్డి ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతోపాటు దిశానిర్దేశం చేయడం వల్ల ఆస్తుల నమోదు పూర్తికావచ్చింది.
ప్రత్యేక బృందాలు రంగంలోకి..
గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ధరణి సర్వే బృందాలు రంగంలోకి దిగి ఆస్తుల నమోదు చేపట్టాయి. సెలవు దినాల్లోనూ ముమ్మరంగా సర్వే జరగడం వల్ల ప్రక్రియ పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చింది. వ్యవసాయేతర ఆస్తులకు ప్రత్యేకంగా పాసు పుస్తకం ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో ప్రజలు కూడా సర్వేకు సహకరించారు. ఖమ్మం జిల్లాలో 93 శాతం ధరణి సర్వే పూర్తవ్వగా... భద్రాద్రి జిల్లాలో 99.53 శాతం పూర్తయినట్లు రెండు జిల్లాల అధికారులు ప్రకటించారు. భద్రాద్రి జిల్లాలో 2లక్షల75వేల 164 ఇళ్ల వివరాలు సేకరించాల్సి ఉండగా... 2లక్షల 75వేల ఆస్తుల గణన పూర్తి చేశారు. జిల్లాలో 398 బృందాలు పనిచేశాయి.