Late Rainfall In Telangana : కాసింత ఆలస్యమైనా... రాష్ట్రంలోనే మొదటగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకే నైరుతి రుతుపవనాలు వచ్చాయన్న ఆనందం ఎంతోసేపు నిలవడం లేదు. ఊరించి ఊసురుమన్న చందంగా అడపాదడపా కురిసినవర్షాలు విత్తనం నాటేందుకు అనువుగా లేక కర్షకులకు నిరీక్షణ తప్పడం లేదు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, భూమిలో నాటిన విత్తనం మొలకెత్తకపోవడం రైతుల్ని వేదనకు గురిచేస్తోంది. దోబూచులాడుతున్న వానాకాలం సీజన్ రైతుల్ని కలవరపెడుతోంది. ఇప్పటికే కొండంత ఆశతో వేలకు వేలు పెట్టుబడులు పెట్టి విత్తనాలు నాటిన సాగుదారులు వరుణదేవుడు కరుణ చూపాలంటూ ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Delay in monsoon Rains : వానాకాలం సీజన్ మొదలై నెల గడుస్తున్నా... గట్టి వాన ఇప్పటికీ ఒక్కటంటే ఒకటి పడలేదు. ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానాకాలం సీజన్ ఇంకా గాడిన పడలేదు. రుతుపవానాల రాక ఆలస్యంతో ఆశించిన మేర పంటల సాగవలేదు. తొలకరి పలకరింపుతో దుక్కులు దున్నుకోవడం, విత్తనాలు సిద్ధంచేసుకోవడంలో రైతులు మునిగారు. ఒకటి రెండు సార్లు అడపాదడపా వానలు కురసి ఆ తర్వాతవరుణుడు ముఖం చాటేశాడు. క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ రావడం వల్ల సాగు సందిగ్ధంలో పడింది. పంటల సాగుకు ఎన్నో ఆశలతో సిద్ధమైన కర్షకులు విత్తనాలు వేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. తొలకరి వానలకు విత్తనాలు నాటిన వారి పరిస్ధితి దయనీయంగా మారింది. వేలకు వేలు పెట్టుబడి పెట్టి నాటిన విత్తనాలు మొలకెత్తక నానా అగచాట్లు పడుతున్నారు.