తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ రోడ్డులో వెళ్తున్నారా...? జర జాగ్రత్త - ప్రమాదకరంగా మారిన పల్లిపాడు ఏన్కూరు రహదారి

దూరం తగ్గుతుందని ఆ రోడ్డులో ప్రయాణిస్తే శాశ్వతంగా దూరమైపోతామనే భయం కలుగుతుంది. ప్రమాదకర మలుపులు... శిథిలమైన వంతెనలు... కూలిపోతున్న మోరీలు... గుంతలు పడిన రోడ్డు... సూచికలు లేని రహదారి.. ఇలా ఒకటా రెండా... మృత్యుమార్గానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నట్లుగా తయారైంది ఖమ్మం జిల్లా పల్లిపాడు-ఏన్కూరు రహదారి.

dangerous road at pallipadu ankuru  highway
ఆ రోడ్డులో వెళ్తున్నారా...? జర జాగ్రత్త

By

Published : Jan 3, 2020, 6:24 AM IST

తొందరగా వెళ్లిపోవచ్చుకదా అనుకునేవారికి ఆ రహదారిలో ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణభూతమముతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాను కలుపుతూ కొత్తగా ఏర్పాటు చేసిన పల్లిపాడు- ఏన్కూరు ప్రధాన రహదారిలో వారానికో ప్రమాదం జరుగుతూ ఈ దారిలో ప్రయాణమంటే వెన్నులో వణుకు పుట్టిస్తుంది.

దూరం తగ్గింది కానీ..

ఖమ్మం నుంచి కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం వెళ్లే వాహనాలు, ప్రయాణికుల సంఖ్య పెరిగింది. రెండేళ్ల కిందట ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్లాలంటే జాతీయ రహదారిలో వైరా, తల్లాడ మీదుగా వెళ్లాల్సి వచ్చేది. ఈ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ప్రయాణికులు సౌకర్యార్థం.. పల్లిపాడు నుంచి కొత్తగా రెండులైన్ల రహదారిని నిర్మించారు. దూరం తగ్గడం... నూతన రహదారి కావడం వల్ల ఎక్కువమంది ఈ మార్గాన్నే ఆశ్రయిస్తున్నారు.

రోడ్డు వేశారు అంతే....

ఇంతవరకు బాగానే ఉన్నా ఆ దారిలో వేగ నియంత్రికలు... రహదారి సూచికలు ఏర్పాటు చేయలేదు. వీటికి తోడు రహదారిపై గుంతలు... చప్టాలు, వంతెనలు పాతబడడం వల్ల ఇబ్బందికరంగా మారింది. కొణిజర్ల మండలం లక్ష్మీపురం వద్ద ఉన్న మలుపు దగ్గర గుట్ట ఉండడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. జన్నారం సమీపంలోను మలుపు వద్ద ఇదే పరిస్థితి. ఏన్కూరు నుంచి జన్నారం తర్వాత రాత్రి వేళల్లో రోడ్డును గుర్తించేందుకు మార్జిన్​లేక ఇబ్బందులు తప్పడం లేదు.

ఇంకెన్ని ప్రమాదాలు జరగాలి?

సమస్యలను ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే వారే కరవయ్యారని స్థానికులు వాపోతున్నారు. ఎప్పడు ఏ ప్రమాదం చూడాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి రహదారిపై నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని వేడుకుంటున్నారు.

ఆ రోడ్డులో వెళ్తున్నారా...? జర జాగ్రత్త

ఇదీ చూడండి: మజిల్​ మానియా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన హైదరాబాదీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details