పత్తి కొనుగోళ్ల సీజన్ ఆరంభంతోనే అన్నదాతలకు కష్టాలు కూడా మొదలయ్యాయి. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పత్తి మార్కెట్‌గా ఖ్యాతిగాంచిన ఖమ్మం మార్కెట్‌కు అక్టోబర్ చివరి వారం నుంచి పత్తి రాక మొదలైంది. రోజుకు దాదాపు 10 వేల బస్తాల వరకు రైతులు మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల నుంచి పత్తి ఖమ్మం మార్కెట్‌కు వస్తోంది. ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న పత్తికి ఆ స్థాయిలో ధరలు లేకపోవడం రైతుల్ని తీవ్రంగా కుంగదీస్తోంది.
ఎకరానికి రూ.10 వేలు కూడా రాలే..
గతేడాది సీజన్ ఆరంభంలో క్వింటాకు రూ. 7,500 వరకు పలికితే.. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్లో గరిష్ఠంగా రూ.5,000 కూడా పలకకపోవడం మార్కెట్‌కు వస్తున్న అన్నదాతల్లో తీవ్ర కలవరం రేపుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఏన్కూరు, కారేపల్లి, కామేపల్లి, కొణిజర్ల, చింతకాని, రఘునాథపాలెం, కూసుమంచి, తిరుమలాయపాలెం, మధిర, ముదిగొండ మండలాల్లో ఈ పంట సాగు చేశారు. ఈసారి దిగుబడి కూడా ఆశాజనకంగానే వస్తుందని ఆశించారు. దాదాపు 20 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ఒక ఎకరం పత్తి సాగుకు రైతులు రూ.32,000 వరకు ఖర్చు చేస్తే ఎకరానికి రూ. 10వేలు కూడా రాలేదని వాపోతున్నారు.
తీవ్ర నైరాశ్యం..