Crops Damaged Due to Hail Rains in Telangana : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు రైతులకు దిగాలు మిగిల్చాయి. లక్షల్లో పెట్టుబడులు పెట్టి వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశామని చివరికి గిట్టుబాటు ధర సైతం దక్కేలా లేదని ఆవేదన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో అకాల వర్షాలకు పంటలు నేలవాలాయి. వడగళ్ల బీభత్సానికి కొమరారం, మసివాగు గ్రామాల్లో మొక్కజొన్న చేతికందే పరిస్థితి లేకుండా పోయింది. కళ్ళాల్లో ఆరబోసిన మిర్చి తడిసి రైతుకు కన్నీరే మిగిల్చింది. మొక్కజొన్న, పెసర, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
రైతులకు కేసీఆర్ సర్కార్ కడగండ్లను మిగిల్చుతోంది : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మర్రిగూడెం పంచాయతీలో రైతుల రోదన ఆకాశన్నంటింది. వడగళ్ల ధాటికి పంట మెుత్తం నష్టపోయామని దిగాలు చెందుతున్నారు. రామ్మూర్తి అనే రైతు అకాల వర్షంతో దెబ్బతిన్న తన మొక్కజొన్న పంట చూసి ఆవేదనతో... పాట రూపంలో తన బాధను వ్యక్తం చేశాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో సుంకిని పోతంగల్‌లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిశీలించారు. మామిడి, మొక్కజొన్న, మిర్చి, పసుపు తదితర పంటల నష్టాన్ని వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ అధికారులు సర్వేచేసి ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. కేంద్రం నుంచి త్వరితగతిన పరిహారం అందేలా చూడాలి రేవంత్ డిమాండ్ చేశారు. పంటల బీమా పథకాన్ని నీరుగార్చి రైతులకు కేసీఆర్ సర్కార్ కడగండ్లను మిగిల్చుతోందని ఆరోపించారు.