Crop Damage in Khammam District : మార్చి 19 నుంచి మే 1 వరకు అన్నదాతను ఊపిరిమెసలకుండా చేసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలు.. సాగుదారుల రూ.కోట్ల పెట్టుబడులను బూడిదలో పోసిన పన్నీరు చేశాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో మొత్తం ఖమ్మం జిల్లాలో 36,242 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. 21 వేల మంది రైతుల పంటలు నష్టపోయి పెట్టుబడులు కూడా మిగలని దయనీయ పరిస్థితి నెలకొంది. ఇందులో ప్రధానంగా మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రకృతి విపత్తులతో 50 శాతం పెట్టుబడులు తుడిచిపెట్టుకుపోయాయి. అంటే ఎకరాకు రైతు రూ.15 వేలు నష్టపోయారని అనుకుంటే.. జిల్లాలో మొక్కజొన్న రైతులకు సుమారు రూ.38 కోట్ల మేర నష్టం జరిగింది.
రూ.8 కోట్ల మేర నష్టం: ఇక వరి సాగుకు ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో 50 శాతం పెట్టుబడులు కోల్పోయారనుకుంటే.. రూ.10 కోట్ల మేర నష్టాలు మూట గట్టుకున్నట్లయ్యింది. ఇలా మూడు దఫాల్లో జిల్లాలో మొక్కజొన్న, వరి రైతులకు మొత్తంగా రూ.48 కోట్ల మేర నష్టం వచ్చింది. ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మార్చి 19 నుంచి మే 1 వరకు వచ్చిన అకాల వర్షాలు, వడగండ్ల వానలతో... రైతులకు రూ.8 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం 3453 ఎకరాల్లో 1786 మంది రైతులు మొక్కజొన్న, వరి పంటలు నష్టపోయారు.
ప్రకృతి మింగిన పంట: కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు మూడడుగులు ముందుకు.. ఏడడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతుండటంతో.. పంటను అమ్ముకునేందుకు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు అన్నదాతలు. ఈలోగా అకాల వర్షం వెంటాడితే విలవిల్లాడుతున్నారు. ప్రకృతి మింగిన పంట పోనూ మిగిలిన పంటను అమ్ముకుంటే.. మిల్లుకు తరలించిన తర్వాత కొర్రీల విధింపులతో తెల్లబోతున్నారు. ఈ సీజన్లో ఉభయ జిల్లాల రైతులకు.. పెట్టుబడుల రూపంలో రూ.57.02 కోట్ల నష్టాలు మూటగట్టుకోవడం అన్నదాత దయనీయ దుస్థితికి అద్దం పడుతోంది.