తెలంగాణ

telangana

ETV Bharat / state

మక్క రైతులపై అకాల వర్షం పిడుగు.. చేతికొచ్చిన పంట నేలపాలు - Crop loss to farmers due to rains

అకాల వర్షం... ఖమ్మం జిల్లా మక్క రైతులను కుదేలు చేసింది. పది రోజుల్లో చేతికొచ్చే మొక్కజొన్న పంటపై పిడుగులా పడ్డ అకాల వర్షాలు..సాగుదారులను నట్టేట ముంచింది. ఈదురు గాలుల బీభత్సంతో వేలాది ఎకరాల్లో పంటలు నేలకొరగడంతో... అన్నదాతపై అదనపు భారం తప్పేలా లేదు. వాలిపోయిన పంటను తీసేందుకు యంత్రాలు, కూలీలకు రెట్టింపు ధరలు చెల్లించాల్సి రావటం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

crop loss in khammam and bhadradri kothagudem districts and formers demands for affordable price for crops
ఖమ్మంను కుదేలు చేసిన అకాల వర్షాలు

By

Published : Mar 21, 2023, 9:54 AM IST

అనుకోని అకాల వర్షాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కుదేలు చేసింది. ఏపుగా పెరిగిన పంటలు నేలకొరిగాయి. పసిపాపలా పెంచిన పంటలు పదిరోజుల్లో చేతికందుతాయి అనే తరుణంలో వర్షాలు పంటలను నేలమట్టం చేశాయి. దీంతో రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశాలు లేకుండా పోయింది. కనీసం మిగిలిన పంటకు అయిన ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తే అప్పుల ఊబి నుంచి బయటపడతామని రైతులు కోరుకుంటున్నారు.

ఆశలు ఆవిరయ్యేలా పంటల తీరు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొక్కజొన్న సాగుచేసిన అన్నదాతల ఆశలు ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. మరో పది రోజుల్లో చేతికి అందాల్సిన సమయంలో అకాల వర్షం పిడుగులా పడి పంటలను సర్వనాశనం చేసింది. ఎకరాకు 30 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన మొక్కజొన్న పంట... అకాల వర్షం దెబ్బకు నేలవాలింది. ఖమ్మం జిల్లాలో 20 వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయశాఖ గుర్తించింది. పది వేల మంది రైతులు పంట నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. భద్రాద్రి జిల్లాలో 64మంది రైతులు 174 ఎకరాల్లో పంట కోల్పొయినట్లు గుర్తించారు.

పసిపాపలా పెంచిన పంట
కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను మార్కెట్‌కు చేర్చడం రైతులకు సవాల్‌గా మారింది. బలమైన గాలుల ధాటికి మొక్కజొన్న పైర్లు నేలవాలి కోతకు వచ్చిన కంకులు కిందపడిపోయాయి. వాటిని తీయాలంటే కర్షకులపై అదనపు భారం తప్పేలా లేదు. వాస్తవానికి చేతికొచ్చిన మొక్కజొన్న తీసేందుకు కూలీలకైతే రోజుకు 300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. యంత్రం సాయంతో కంకులు కోయాల్సి వస్తే..ఎకరాకు 3వేలు ఖర్చయ్యేది. ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కజొన్న కంకులు కోయించాలంటే కూలీలకు రోజుకు 600, యంత్రంతోనైతే ఎకరాకు ఐదు వేలు సమర్పించుకోవాల్సిన దుస్థితి. పంట తీసేందుకు రెట్టింపు ఖర్చులు భరించాల్సి రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"50రోజుల నుంచి 60రోజుల పంట ఇది. ఇంకా కంకి గట్టిపడలేదు. ప్రభుత్వం ఆదుకొని మద్ధతు ధర ఇవ్వాలని కోరుకుంటున్నాం. పంట మంచిగ ఉన్నప్పుడే మొక్కజొన్న ధర రూ.500అడిగారు. మరి ఇప్పుుడు ఎంత అడుగుతారో మాకు తెలియదు. అంతా వారి దయ అది. కల్లాల్లో ఆరబెట్టిన మక్క అంతా తడిసిపోయింది. 6ఎకరాల మొక్కజొన్న అంతా నేలకొరిగిపోయింది. 20రోజుల్లో చేతికొచ్చే పంట అంతా నేలపాలైంది. 40బస్తాలు పండే పొలంలో ఇప్పుడు 20 బస్తాలయిన వస్తదా రాదా అనే అనుమానంతో ఉన్నాము. గిట్టుబాటు రేటు ఇస్తే బాగుంటుందని కోరుతున్నాము. పంటను పసిపాపను సాదుకున్నట్లు సాదుకొని ఈరోజు చేనుకొచ్చి చూస్తే కళ్లవెంట నీళ్లోస్తున్నాయి. పెట్టుబడి అంతా అయిపోయింది. 40క్వింటాళ్లయిన వస్తుందమో అనుకుంటే కనీసం 15క్వింటాళ్లు కూడా వచ్చే అవకాశం కనిపించడంలేదు. పంట మాచేతికొచ్చే సమయంలో ఇలా దెబ్బతింది. ఇంకా 4రోజులైతే పడిపోయిన పంటలో ఎలుకలు, చెదలు వస్తాయి. కనీసం పండిన పంటకైనా ప్రభుత్వం మద్ధతుధర ఇస్తే బాగుంటుంది. ఎంతో పెట్టుబడి పెట్టి 6ఎకరాలు వేస్తే ఏమి మిగిలేలా లేదు."_రైతులు

ఈ సీజన్‌లో అన్ని అనుకూలతల దృష్ట్యా ఎకరాకు సుమారు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలుల ధాటికి 20 క్వింటాళ్లు మించి రాదని ఆవేదన చెందుతున్నారు.

ఖమ్మంను కుదేలు చేసిన అకాల వర్షాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details