తెలంగాణ

telangana

ETV Bharat / state

crop loss: అకాల వర్షం ఆగడం లేదు.. అన్నదాత వెతలు తీరడం లేదు

Crop Loss Due To Untimely Rains: కల్లం నిండా గింజలున్నా రైతన్నా..పల్లెం నిండా మెతుకుల్లేవు రైతన్నా.. అన్నదాత దైన్యంపై ఓ సినీ కవి రాసిన పాట ఇప్పుడు కర్షకులకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. పుడమి తల్లినే నమ్ముకున్న మట్టిమనిషికి పుట్టెడు కష్టమొచ్చింది. అకాల వర్షం దెబ్బకు విలవిల్లాడుతున్న కర్షకుడి కష్టాన్ని చూసి కాలం కాసింతైనా కనికరించడం లేదు. పగబట్టిన నాగులా విరుచుకుపడుతున్న ప్రకృతి ఇకనైనా శాంతిస్తుందా..మండుటెండలు దంచికొట్టాల్సిన సమయంలో ముంచెత్తుతున్న వరుణుడి ఉగ్రరూపం ఆగుతుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు. తెల్లారితే, పొద్దూకితే మొగులు వైపు చూస్తూ దేవుడిపైనే భారం వేసి మొక్కుతున్నాడు. ఐనా ప్రకృతి కనికరించడం లేదు. అకాల వర్షం ఆగడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షం కష్టాలు అన్నదాత పుట్టి ముంచుతున్నాయి.

crop loss due to heavy rains in telangana
అకాల వర్షాలతో కుదేలైన రైతు.. ఎంత చేసినా శ్రమజీవికి నష్టాల మూటే

By

Published : May 3, 2023, 9:02 AM IST

అకాల వర్షం ఆగడం లేదు.. అన్నదాత వెతలు తీరడం లేదు

Crop Loss Due To Untimely Rains: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకాల వర్షం అన్నదాతకు గుండెకోతను మిగిలిస్తున్నాయి. ముఖ్యంగా చేతికొచ్చిన మొక్కజొన్న, రైతు లోగిళ్లలో సిరులు కురిపించాల్సిన ధాన్యం అకాల వర్షాల దెబ్బకు సాగుదారులకు తీరని వెతలు మిగిలిస్తున్నాయి.కేవలం 15రోజుల్లోనే ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు ముంచెత్తిన వానలతో మొక్కజొన్న, వరిపంటలు నేలవాలి కర్షకుల ఆశల్ని అడియాశలు చేస్తున్నాయి.

చేతికొచ్చిన మొక్కజొన్న గాలివానకు నేలవాలి అన్నదాతల ఆశల్ని ఆవిరి చేస్తోంది. వేలకు వేలు పెట్టిన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. ఆకాల వర్షం వరుస దెబ్బను తట్టుకుని చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు.. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం రైతు చిత్తవుతున్నాడు. అకాల వర్షానికి కేంద్రాల్లో ధాన్యం తడవడం,ఆరబెట్టుకోవడమే సరిపోతుంది. రోజులతరబడి ఎదురుచూసినా నిబంధనల ప్రకారం తేమశాతం రాక.. పడిగాపులు తప్పడం లేదు.ఫలితంగా రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కర్షకులు కంటిమీద కనుకు లేకుండా పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న అన్నదాత దయనీయతకు అద్దం పడుతోంది.

అదనపు భారం:వరుస గాలివానలతో ఉభయ జిల్లాల్లోని వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, వరి పైర్లు నేలవాలాయి. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలతో మరో 15 రోజుల్లో చేతికొచ్చే మొక్కజొన్న తోటలునేలవాలి రైతుల గుండెను పిండేస్తున్నాయి. మొక్కజొన్న కంకుల్లో నీరుచేరి కంకులు రంగు మారి మొలకెత్తుతున్నాయి. అంతేకాదు.. ప్రస్తుతం కిందపడిపోయిన కంకులు తీయడం అన్నదాతకు భారంగానే మారింది.

ఒక్కో కర్రను పైకి లేకి కంకులు తీయాల్సి ఉంటుంది. మిషన్లతో చేసే పరిస్థితి లేదు. సాధారణ సమయంలో రోజువారీ కూలీ రూ.250 చెల్లించేవారు. కానీ పెద్దఎత్తున పంటలు నేలవాలిపోవడంతో కూలీలకు డిమాండ్ అమాంతం పెరిగింది. నేలవాలిన పంటలో మొక్కజొన్న తీసేందుకు ఒక్కో కూలీ రూ.400 డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎకరంలో మక్కలు తీసేందుకు సుమారు 15 మంది కూలీలు అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు నేలవాలిన తోటల నుంచి మక్కలు తీయాలంటే ఒక్కో ఎకరాకు రైతుకు రూ.6000 భరించాల్సి వస్తుంది. తీసిన తర్వాత మళ్లీ మక్కలు మోయడం, ఆరబెట్టడం, రవాణా ఖర్చులు అదనమే.

సవాల్​గా పంట కోతలు:ధాన్యం రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కోతలకు సిద్ధంగా ఉన్న వరి పైర్లన్నీ నేలవాలి రైతు కంట కన్నీరు పెట్టిస్తుంటే.. పంట అమ్ముకునేందుకు కేంద్రాలకు వచ్చిన కర్షకుల పరిస్థితి మరింత కంటతడి పెట్టిస్తోంది. కోసేందుకు సిద్ధంగా ఉన్న వరి పైర్లు అకాల వర్షానికి నేలవాలడంతో ఇప్పుడు పంట కోయడం సవాల్​గా మారింది. కోత యంత్రాలకు భారీ డిమాండ్ ఉండటంతో సాధారణ సమయంలో కన్నా రెట్టింపు ధరలు చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు.. కోతల సమయంలో వడ్లు రాలిపోయి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.

నష్టాల మూటే:చేతికొచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని తీసుకుని కేంద్రాలకు వచ్చిన కర్షకులకు పంటను అమ్ముకోవడం పెద్ద సవాల్​గా మారింది. అకాలవర్షాలతో తడిసిన ధాన్యం ఆరబెట్టుకోవడం, మళ్లీ వర్షం కురవడంతో నిబంధలకు అనుగుణంగా తేమశాతం రావడం గగనంగా మారింది. ఫలితంగా ధాన్యం రైతులకు కేంద్రాల్లో పడిగాపులు తప్పడం లేదు. ఇలా అకాల వర్షాలు అన్నదాతకు అపార నష్టం కలిగిస్తున్నాయి. పంటల సాగుకోసం వేలకు వేల పెట్టుబడులు పెట్టిన కర్షకులు.. పంటను కాపాడుకునేందుకూ భారీగానే ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఇంత చేసినా శ్రమజీవికి దక్కుతున్నది నష్టాల మూటే.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details