జిన్నింగు మిల్లుల కేంద్రాల్లోనే ఈనెల 13 నుంచి 20 వరకు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేస్తారని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పత్తి విక్రయించే రైతులు ముందుగానే జిన్నింగు మిల్లుల వద్ద టోకెన్లు తీసుకుని, దానిలోని తేదీ ప్రకారం మిల్లులకు పత్తి తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి నాగరాజు సీసీఐ కేంద్రాలున్న జిన్నింగు మిల్లుల్లో పత్తి కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
పత్తి కొనుగోళ్లకు పచ్చ జెండా - ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
లాక్‌డౌన్ నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్లలోగానీ సీసీఐ కేంద్రాల్లోగానీ రైతులు తమ వద్ద ఉన్న పత్తి నిల్వలను విక్రయించలేకపోయారు. వ్యాపారులకు విక్రయించుకునే అవకాశం లేక తమ ఇళ్లలోనే రైతులు పత్తిని నిల్వ ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
వ్యవసాయ మార్కెట్లు తెరిచే అవకాశం లేకపోవటం వల్ల ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఖమ్మం జిల్లాలో వ్యాపారుల ద్వారా లాక్‌డౌన్‌కు ముందు వరకు సుమారు 9.22 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. సీసీఐ జిన్నింగు మిల్లుల కేంద్రాల్లో 28,664 మంది రైతుల నుంచి మరో 8.29 లక్షల క్వింటాళ్ల సరుకును కొన్నారు. ఇది కాక మరో 25-30 శాతం వరకు రైతుల దగ్గర పత్తి నిల్వలున్నాయి. వాటినిప్పుడు విక్రయించుకునే అవకాశం ఏర్పడింది.
- జీఆర్‌ఆర్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, వెంకటగిరి, ఖమ్మం గ్రామీణం
- శ్రీసాయి బాలాజీ జిన్నింగు అండ్ అయిల్ మిల్, తల్లంపాడు, ఖమ్మం గ్రామీణం
- అమరావతి టెక్స్‌టైల్స్ ప్రైవేటు లిమిటెడ్(కనకదుర్గా కాటన్ మిల్స్ ప్రైవేటు లిమిటెడ్) దెందుకూరు, మధిర
- శ్రీశివగణేశ్ కాటన్ ఇండస్ట్రీస్, ఇల్లెందులపాడు, మధిర
- లోయల్ టెక్స్‌టైల్స్ మిల్స్ లిమిటెడ్, అన్నారుగూడెం, తల్లాడ
- శ్రీభాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్, గోలితండ, పాతర్లపాడు, తిరుమలాయపాలెం
- జీఆర్‌ఆర్ జిన్నింగ్ మిల్స్ ప్రైవేటు లిమిటెడ్, పొన్నెకల్లు, ఖమ్మం గ్రామీణం
ఇదీ చూడండి :నర్సులకు వందనం..మీ సేవలకు సలాం...