తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షాల కారణంగా రైతుల ఆశలు దూదిపింజలు..

ఈ ఏడాది వర్షాలు బాగా పడుతున్నాయ్​.. పంట అధిక దిగుబడి వచ్చి.. తమకు సిరులను కురిపిస్తుందని.. అప్పులన్నీ తీర్చేసుకోవచ్చని పత్తి రైతుల ఎన్నో కలలు కన్నారు. కానీ తీరా పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు వారి కలల్లో కడగండ్లు మిగిల్చాయి. వానల వల్ల తీరని నష్టం వాటిల్లింది. మిగిలి ఆ కొంచెం పత్తైన తీద్దామంటే కూలీలు కొరత ఉందంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలంటూ ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు.

cotton farmers difficulties in khammam due to floods
అకాల వర్షాల కారణంగా రైతుల ఆశలు దూదిపింజలు..

By

Published : Nov 2, 2020, 2:36 PM IST

అకాల వర్షాలు కలిగించిన నష్టం రైతును ఆర్థికంగా కుంగదీస్తోంది. పెసర పైరు దెబ్బతిని గింజ కూడా చేతికందకుండా పోయింది. అంతలోనే మళ్లీ భారీ వర్షాలు పత్తి రైతును దెబ్బతీశాయి. కనీసం పెట్టుబడులు రాని దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఉన్న కొద్ది పంటను తీయాలంటే కూలీల ఖర్చు అన్నదాతకు మరింత భారంగా మారుతోంది. స్థానిక కూలీలు పనులకు రాకపోవడం వల్ల బయట మండలాల నుంచి ఆటోలు, ట్రాలీల ద్వారా రవాణా ఖర్చులు భరించి మరీ తీసుకురావాల్సిన దుస్థితి నెలకొంది. కూలీ, పత్తి తీసేందుకు కిలోకు చెల్లించే ధరలనూ పెంచేశారు. ఇంకోవైపు చూస్తే మార్కెట్‌లో పంటకు మద్దతు ధర లేదు. ఇన్ని కష్టాల్లో తమకు మిగిలేవి అప్పులేనని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

దెబ్బతీసిన వర్షం

విడువకుండా కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల, చింతకాని, కారేపల్లి, తల్లాడ, ఖమ్మం రూరల్‌, బోనకల్లు, మధిర, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో, భద్రాద్రి జిల్లాలోని సుజాతనగర్‌, కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, బూర్గంపాడు, పినపాక మండలాల్లో పత్తి పైర్లు బాగా దెబ్బతిన్నాయి. అల్పపీడనాలకు తోడు అకాల వర్షాలు దెబ్బమీద దెబ్బతీశాయి. అంతకు ముందే చేతికందాల్సిన పెసర కూడా చెట్లపైనే మొలకలొచ్చి పూర్తి నష్టాన్ని మిగిల్చింది. ఖమ్మం జిల్లాలో 30 శాతం, భద్రాద్రి జిల్లాలో 35 శాతం మేర పత్తి దెబ్బతిందని అధికారులు అంచనా వేసినా.. కనపడని నష్టాలను కర్షకులు చవిచూస్తున్నారు. బ్యాంకుల నుంచి అప్పు పుట్టకపోవడం వల్ల బయట అధిక వడ్డీలకు బాకీలు చేసి ఈ ఏడాది సాగుచేస్తే అతివృష్టి నడ్డివిరిచింది. ఎకరానికి కనిష్ఠంగా రూ.12వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు వారి రెక్కల కష్టం సైతం మిగలకపోగా, కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. వరుసగా రెండు పంటలు దెబ్బతినడం వల్ల కౌలురైతులు మరింతగా నష్టాల్ని చవిచూశారు.

పత్తితీతకు కష్టాలు..

అకాల వర్షాలతో కాయలు నల్లబడటం, దూది విచ్చుకోకపోవడం వల్ల అందులో నుంచి పత్తి తీయడం ఇబ్బందిగా మారింది. గతంలో ఒక్కో కూలీ రోజుకు 50 కిలోల నుంచి 80 కిలోల వరకు తీసేవారు. ఇప్పుడు 10 నుంచి 15 కిలోలు తీయడం కష్టంగా మారింది. కిలోకు రూ.10 నుంచి రూ.12 వరకు రైతులు చెల్లిస్తున్నారు. ఒక క్వింటాకు రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు ఖర్చు వస్తోంది. కూలీల కొరతతో ఇతర ప్రాంతాల వారిని రోజుకు రూ.1000 వరకు రవాణా ఖర్చు చేసి మరీ రప్పిస్తున్నారు. మరోవైపు మార్కెట్‌లో రూ.3500 నుంచి రూ.4000 వరకు మాత్రమే క్వింటా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న పంట చేతికందగానే చెట్లను తొలగించేస్తున్నారు. చివరకు ఈ ఏడాది తెల్లబంగారంపై పెట్టుకున్న ఆశలు దూదిపింజల్లా తేలిపోయాయి.

ఇదీ పరిస్థితి

ఉభయ జిల్లాల్లో పత్తి విస్తీర్ణం: 2,08,675 హెక్టార్లు

* పెట్టుబడి ఎకరానికి: రూ.12 వేలు

* ఎకరానికి దిగుబడి: 5 క్వింటాళ్లు

* కూలీల ఖర్చు 5 క్వింటాళ్ల తీతకు: రూ.6500

* కూలీల ఖర్చు + పెట్టుబడి= 6500+12000= 18,500

* ఇప్పుడు ధర ప్రకారం రాబడి: సుమారు రూ. 20,000

* మిగులు: రాబడి - పెట్టుబడి: రూ.20,000 - రూ.18500=రూ.1500

ఇదీ చూడండి:పత్తి రైతుల ఆశలు అడియాశలు... నిండాముంచిన పరిస్థితులు

ABOUT THE AUTHOR

...view details