ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన 27 ఏళ్ల మహిళ సరిగ్గా 15 రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జిల్లా ఆస్పత్రిలో ప్రసవం అనంతరం తల్లి గారింటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం మహిళ పరిస్థితి ఆందోళనకరంగా మారడం వల్ల మళ్లీ ఖమ్మం ఆస్పత్రికి తీసుకొచ్చారు బంధువులు. తెల్లవారుజామున ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే మహిళ మృతిచెందింది. ఈలోగా కుటుంబ సభ్యులకు గుండె పగిలే వార్త తెలిసింది. కరోనా సోకడంతోనే మహిళ చనిపోయిందని ఆస్పత్రి వైద్యులు రిపోర్టు ఇచ్చారు.
15 రోజులకే అమ్మ పొత్తిళ్ల నుంచి దూరం
లోకం కూడా తెలియని శిశువు...15 రోజులకే అమ్మ పొత్తిళ్ల నుంచి దూరమైన తల్లి లేని వాడిగా మిగిలాడు. ఇక భార్యను పోగొట్టుకున్న భర్త, మహిళ కుటుంబ సభ్యుల వేదన అంతా ఇంతా కాదు. కరోనా సోకి చనిపోయిందని గ్రామస్థులకు సమాచారం అందడం వల్ల మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాకుండా.. పొలిమేరల్లో కంచె వేశారు. కనీసం కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు కూడా చేయలేని దయనీయ పరిస్థితి కరోనా కాటు విధించిన శాపానికి నిదర్శనంగా మిగిలింది.
తండ్రికి తలకొరివి పెట్టలేని పరిస్థితి
ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం, భద్రాద్రి జిల్లాల్లోని ఇల్లెందులో కరోనాతో కుటుంబసభ్యులను కోల్పోయిన కుటుంబాలదీ ఇదే దయనీయ దుస్థితి. రఘునాథపాలెం మండలం వెంకటాయపాలేనికి చెందిన 62 ఏళ్ల వ్యక్తి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌తో చనిపోయారు. ఇద్దరు కొడుకులున్నా తండ్రికి తలకొరివి పెట్టలేని పరిస్థితి. గ్రామస్థులు అసలు మృతదేహాన్ని గ్రామంలోకి కూడా తీసుకురావొద్దనడం వల్ల విధిలేని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు అంత్యక్రియలు కూడా చేయలేదు. గ్రామ శివారులో మృతదేహాన్ని ఖననం చేసేందుకు మట్టి తీసేందుకు వచ్చిన జేసీబీ వాహనం డ్రైవర్ కూడా పారిపోయాడు. ఇల్లెందులో ఓ మహిళ కరోనా పాజిటివ్ తో చనిపోయింది ఆమె అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేక...కన్నీరుమున్నీరుగా విలపించారు.
మేమున్నామంటూ ముందుకొచ్చిన అన్నం సేవా ఫౌండేషన్
ఇలా ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాదు.. రాష్ట్రం, దేశవ్యాప్తంగానూ కరోనా కాటుతో ఇలాంటి కన్నీటి కథలు కనిపిస్తున్నాయి. కుటుంబసభ్యుడు, బంధువో చనిపోతే కనీసం చివరి వీడ్కోలు పలికేందుకు రాకుండా.. అంతిమ సంస్కారాలు కూడా చేయకుండా ప్రాణభయంతో దూరం ఉండేలా చేస్తోంది. ఇలా అందరూ ఉండి అనాథ శవాలుగా మారిన ఇలాంటి వారికి ఖమ్మంకు చెందిన అన్నం సేవా ఫౌండేషన్ మేమున్నామంటూ ముందుకొచ్చింది. కరోనా భయం వెంటాడుతున్నా...ఏమాత్రం వెనకడుగు వేయకుండా...కరోనా మృతులకు అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.... మృతులకు కుటుంబ సభ్యులుగా మారి తుది వీడ్కోలు పలుకుతున్నారు.
ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?