ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా వ్యాప్తి చెందిన తొలిరోజుల్లో ఒకటి, రెండు కేసులు నమోదవగా క్రమంగా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. పట్టణ ప్రాంతాలపై క్రమంగా తన పంజా విసురుతోంది. ముఖ్యంగా ఖమ్మం నగరంతోపాటు... ఇతర పట్టణ ప్రాంతాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నెల రోజులుగా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. ఉమ్మడి జిల్లాల్లో నమోదయ్యే కేసుల్లో దాదాపు 90 శాతం పట్టణ ప్రాంతాల్లోనే నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఖమ్మంలో...
ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 3,736 మంది నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా... 778 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించి... 2,900 నమూనాలు సేకరించగా... వారిలో 680 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసుల్లో దాదాపు 90 శాతం ఒక్క ఖమ్మం నగరంలోనే కావడం గమనార్హం. వైరా, మధిర, సత్తుపల్లి పట్టణాలలో సైతం వైరస్ వృద్ధి చెందుతుంది.
భద్రాద్రిలో..
భద్రాద్రి జిల్లాలో 680 మందిక నమూనాలు సేకరించగా... 168 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పాజిటివ్ కేసుల్లోనూ సింహభాగం కేసులు పట్టణ ప్రాంతాల్లో నమోదైనవే. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇల్లెందు, మణుగూరు పట్టణాల్లో ఇప్పటి వరకు 7 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నెలరోజుల్లోనే..
ప్రస్తుతం అన్ని పట్టణాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వ్యాపార, వాణిజ్య కేంద్రాలు కావడం, ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారాలు రాకపోకలు సాగిస్తుండటంమే వైరస్ వ్యాప్తికి కారణమంటున్నారు వైద్యులు. ఎన్నిసార్లు హెచ్చరించినా... ప్రజల్లో నిర్లక్ష్యం వహించడం, చీటికీ మాటికీ విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు.