కరోనా ప్రభావం క్రమంగా విస్తరించడం, పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగిపోవటంతో వ్యాపార, వాణిజ్య సముదాయాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఎవరి నుంచి ఎవరికి వైరస్ సోకుతుందోనన్న ఆందోళనలో... ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను ప్రకటించుకున్నాయి.
ఖమ్మం జిల్లా కేంద్రంలో రోజురోజుకు వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలోనే అత్యధికంగా ఖమ్మం నగరంలోనే పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజలన్ని భయాందోళనకు గురిచేస్తోంది.
ఇద్దరు వ్యాపారులు మృతి...
ప్రధాన వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉన్న గాంధీ చౌక్‌లో ఇద్దరు వ్యాపారులు కరోనాతో మృతి చెందండంతో అక్కడ వ్యాపారాలు కలవరానికి గురయ్యారు. ఈ పరిణామంతో కరోనా ఉద్ధృతిని తగ్గించేందుకు స్వచ్ఛంధంగా లాక్ డౌన్ కు సిద్ధమయ్యారు.
కొన్ని రోజులపాటు వస్త్ర దుకాణాలన్నీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే నడపాలని వస్త్ర వ్యాపారుల సంఘం తీర్మానించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారం సాగించాలని బంగారం, వెండి వ్యాపారులు నిర్ణయించారు. కిరాణా దుకాణాలు సైతం సాయంత్రం 6 గంటలకే మూసేస్తున్నారు.
గగనమవుతోంది..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని ప్రధాన పట్టణాల్లోనూ వ్యాపార, వాణిజ్య సముదాయాల పనివేళలను ఒకపూటకే తగ్గించారు. వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు ప్రాంతాల్లోనూ సాయంత్రం వరకే వ్యాపారాలు సాగించాలని నిర్ణయించారు. భద్రాచలంలో నిత్యం దాదాపు 10 కోట్ల వ్యాపారాలు సాగేవి. ఇప్పుడు 6 కోట్ల మేర జరగడమే గగనమవుతోంది.