తెలంగాణ

telangana

By

Published : May 25, 2020, 9:28 AM IST

ETV Bharat / state

కరోనా కాటుకు కళ తప్పిన విపణి

కొవిడ్‌-19 ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రంజాన్‌ వేళ విపణి కళతప్పింది. రంజాన్‌ నెల ఆరంభం రోజు నుంచి ముగింపు వరకు గతంలో ప్రతిరోజు పట్టణాల్లో సందడి కనిపిస్తూనే ఉండేది.

corona and lock down effect on business during Ramadan in khammam district
కరోనా కాటుకు కళ తప్పిన విపణి

రంజాన్​ మాసంలో ఖమ్మంలోని కమాన్‌బజార్‌, కస్పాబజార్‌తోపాటు కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, మధిర, వైరా లాంటి ప్రధాన కేంద్రాల్లోని షాపింగ్‌మాల్స్‌, ఇతరత్రా వ్యాపార సముదాయాలన్నీ కళకళలాడుతూ కనిపించేవి. కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్​డౌన్​ వల్ల ఈ ఏడాది ఆ సందడి లేదు.

రవాణా అడ్డంకులు..

రంజాన్‌ నెలలో ఖమ్మం విపణిలో లభించే అరుదైన, నాణ్యమైన వస్తువులుగా భావించే వాటికోసం అన్ని వర్గాల వారు ఎదురుచూసేవారు. అందులో అత్తర్లు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చే అత్తరు సీసాలను ఏటా విక్రయించేవారు. ఇతర ప్రాంతాల నుంచి పండ్లు, డ్రైఫ్రూట్స్‌ తీసుకొచ్చేవారు. ఇంకా ఖర్జూర, పాదరక్షలు విక్రయశాలలు ఏర్పాటు చేసేవారు. ఈసారి రవాణా సౌకర్యం లేక వీటి ఊసే కరవైంది.

పడిపోయిన వ్యాపారం

వస్త్ర వ్యాపారంతోపాటు అలంకరణ సామగ్రి, తినుబండారాలకు (హలీమ్‌, సేమియా, ఖర్జూర మొ..) సంబంధించిన వ్యాపారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు సాగుతుందని అంచనా. ఈసారి ఆ వ్యాపారం రూ.రెండు కోట్లకు పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. రంజాన్‌కు వారం రోజుల ముందు నుంచే కిటకిటలాడే వ్యాపార సముదాయాలు ఒక్కరోజు ముందు కూడా వెలవెలబోతూ కనిపించాయి.

పాత నిల్వలతోనే సరి

రంజాన్‌ నేపథ్యంలో షాపింగ్‌కు ఉన్న ఆదరణ చూసి వ్యాపారులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల వస్తువుల్లో కొత్త మోడళ్లను పరిచయం చేయడంతోపాటు రాయితీలతో ఆకట్టుకునేవారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయి, ఉత్పత్తులు ఆగిపోవడంతో ఈసారి తమ దగ్గర ఉన్న పాత నిల్వలతోనే రాయితీలను ప్రకటించి వ్యాపారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వాటితోనే వినియోగదారులు సంతృప్తి పడ్డారు.

పేద, మధ్యతరగతిపైనే ప్రభావం

కరోనా మహమ్మారి ప్రభావం ప్రధానంగా పేద, మధ్యతరగతి వర్గాలపైనే అధికంగా పడింది. ఉన్నత వర్గాలకు చెందిన వారు ఎప్పటిలాగే షాపింగ్‌ పూర్తిచేశారు. నలుగురు లేదా అయిదుగురు సభ్యులున్న సగటు కుటుంబంలో వారికున్న ఒక్కరు లేదా ఇద్దరు చిన్నపిల్లలకు మాత్రమే కావాల్సిన వస్త్రాలను, అలంకరణ సామగ్రి కొనిచ్చి తల్లిదండ్రులు సంతోష పడుతున్నారు.

సడలింపులతో కాస్త నయం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రంజాన్‌ మాసంలోనూ వస్త్ర దుకాణాలు తెరచుకోవని భావించాం. కాస్త సడలింపులు ఇవ్వడంతో వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. ఆశించిన స్థాయిలో జరగకపోయినా వ్యాపారాలు పునఃప్రారంభం కావడం కొంత ఊరట కలిగించే విషయమే. ప్రతి ఏడాది రంజాన్‌లో ఖమ్మంలో రూ.మూడు కోట్లు, కొత్తగూడెంలో రూ.కోటి వరకు వస్త్ర వ్యాపారం జరిగేది. ఈసారి రెండు ప్రధాన కేంద్రాల్లో వ్యాపారం రూ.కోటికి మించలేదు.

- వినోద్‌లాహోటి, ప్రముఖ వస్త్రవ్యాపారి, ఖమ్మం

ABOUT THE AUTHOR

...view details