Congress Padayatra: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు పాదయాత్రలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ, నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌లో పాదయాత్ర చేపట్టిన పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌యాదవ్ దోమలగూడ నుంచి పాదయాత్ర చేశారు. కుసుమంచిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన యాత్ర రెండో రోజు ఖమ్మం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా భట్టికి ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు గజమాలతో ఆయనను సత్కరించారు. తిండి గింజలు లేని స్థితి నుంచి ఇతర దేశాలకు సరఫరా చేసే స్థాయికి కాంగ్రెస్ దేశాన్ని తీర్చిదిద్దిందన్న భట్టి ఇవాళ మోదీ సర్కార్ వ్యాపారవేత్తల చేతుల్లో పెడుతున్నారని ఆరోపించారు.
ములుగు జిల్లాలో పాదయాత్రలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే సీతక్క జగ్గన్నపేట గిరిజన బాలికల వసతి గృహంలో బస చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి పాదయాత్ర ప్రారంభించిన ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో పర్యటించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర... ఐనవోలు మీదుగా వర్ధన్నపేట వరకు కొనసాగింది. మల్లికార్జునస్వామి దర్శనం అనంతరం వర్ధన్నపేట పరిధిలోని గ్రామాల్లో ప్రజాసమస్యలను తెలుసుకుంటూ నేతలు యాత్ర సాగిస్తున్నారు.
కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్ర రెండో రోజు ఎల్లారెడ్డిపేట నుంచి సిరిసిల్ల సమీపంలోని పెద్దూరు వరకు చేరుకుంది. యాత్రలో భాగంగా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడుతూ కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధిని వివపిస్తూ పొన్నం ముందుకు సాగారు. సంగారెడ్డి జిల్లా హస్నాబాద్‌లో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. సింగీతం వరకు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన రాజనర్సింహ స్వాతంత్య్ర ఉద్యమంలో మహనీయుల త్యాగాలను ప్రజలకు వివరించారు.