Revanth Reddy Speech at Khammam Meeting : డిసెంబరు 9 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని.. ఆరోజే విజయోత్సవ సభ ఇక్కడే జరుపుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది.. ఖమ్మం జిల్లానేనని గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. కాంగ్రెస్ సభకు భారీగా ప్రజానీకం వచ్చారని హర్షించారు. అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధి రెండు పాదాలపై నడిపిస్తామని రేవంత్ అన్నారు. పొంగులేటి చేరికతో ఖమ్మంలో పదికి పది సీట్లు కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క ప్రసంగించారు.
"తెలంగాణ పొలిమేరల నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని .. అండమాన్ వరకు తరమాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలదే. కేసీఆర్ నుంచి విముక్తి కల్పించడానికి లక్షలాది ఖమ్మం బిడ్డలు ఈ రోజు సమావేశానికి వచ్చారు. సభ పెట్టుకుంటామంటే బస్సులు, లారీలను రానివ్వలేదు. రాబోయే డిసెంబరు 9 నాడు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది." - రేవంత్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షడు
Batti Vikramarka Comments On BRS : మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అప్పు చేశారు.. కానీ జనం సమస్యలను తీర్చలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర సంపదను ప్రజలకు పంచేందుకు కాంగ్రెస్ రావాలని భట్టి స్పష్టం చేశారు. ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో భట్టి విక్రమార్క పాల్గొని.. ప్రసంగించారు. ఈ మేరకు బీఆర్ఎస్, కేసీఆర్‌లపై విమర్శలు గుప్పించారు.