Rahul Gandhi Comments on BRS :భారత్ రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీకి.. బీ టీమ్‌గా మారిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఖమ్మంలో జనగర్జన సభలో పాల్గొన్న రాహుల్.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అవినీతికి.. ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నాయని దుయ్యబట్టారు. లిక్కర్ స్కామ్ ఎవరు చేశారో.. మోదీ ఏజెన్సీలకు తెలిసినా ఏం చేయడం లేదంటూ ఎద్దేవా చేశారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతామన్న ఆయన.. చేయూత పేరిట వృద్ధులు, వితంతువులకు పింఛన్ రూ.4,000 చేస్తామన్నారు. పోడు భూములన్నింటినీ పంచుతామని ప్రకటించారు.
Rahul Gandhi Khammam Meeting Speech :ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన సభ.. శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ సభకు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరై..మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు కూడా రాహుల్ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. భారత్ జోడోయాత్రకు కొనసాగింపుగాసీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రను సభా వేదికపై రాహుల్ సమక్షంలో ముగించారు. విక్రమార్కను ప్రత్యేకంగా అభినందించిన రాహుల్.. ఆయన్ను సన్మానించారు.
Congress Meeting at Khammam :అనంతరం శ్రేణులనుద్దేశించి మాట్లాడిన రాహుల్.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు తలచింది ఒకటైతే.. బీఆర్ఎస్ చేసేది ఒకటంటూ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఏకంగా తన పార్టీ పేరే మార్చుకొని భారత్ రాష్ట్ర సమితిగా మారిందన్నారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని.. రాహుల్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఖతం అయ్యిందని.. వాళ్లకే తెలియకుండా చిరునామా లేకుండా పోయిందని ఆరోపించారు. హైవేపై నడుస్తున్న బండికి.. నాలుగు చక్రాలు పంక్చర్ అయినట్టుందన్న ఆయన.. ఇప్పుడు పోటీ కాంగ్రెస్, బీజేపీ బీ టీమ్ మధ్యే ఉంటుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.