తెలంగాణ

telangana

ETV Bharat / state

పచ్చని గుట్టలను పిండిచేస్తున్న అక్రమార్కులు... మట్టితో కోట్ల దందా! - clay danda in khammam

పచ్చదనం పెంపొందించేందుకు ఏటా హరితహారం పేరుతో ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోంది. హరిత అందాలు పరుచుకున్న కొండలు, గుట్టలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కొందరి అధికారుల తీరుతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతోంది. అనుమతుల ముసుగులో ఇష్జారాజ్యంగా గుట్టలను గుల్ల చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. అధికార యంత్రాంగమే అక్రమార్కులకు కొమ్ముకాస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖమ్మానికి కూతవేటు దూరంలో దర్జాగా మట్టి దందా జరుగుతున్నా అధికారులు ఏం జరగడం లేదంటూ నివేదిక సమర్పించడం చర్చనీయాంశంగా మారింది.

concessionaires
మట్టితో కోట్ల దందా

By

Published : Jul 28, 2021, 4:29 AM IST

పచ్చని గుట్టలను పిండిచేస్తున్న అక్రమార్కులు... మట్టితో కోట్ల దందా!

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచలక రెవెన్యూ పరిధిలోని 192/1 సర్వే నెంబర్​లో నాలుగు హెక్టార్లు అంటే 10 ఎకరాల్లో మట్టి తవ్వకాలు జరుపుకునేందుకు కొంతమంది గుత్తేదారులు అనుమతి పొందారు. 10 ఎకరాల్లో మాత్రమే మట్టి తవ్వకాలకు అనుమతి ఉన్నప్పటికీ అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు జరిగాయని గతం నుంచే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు తీసుకున్న చోటే కాకుండా పక్కనే ఉన్న మరికొన్ని సర్వేనెంబర్లలోనూ మట్టి తవ్వకాలు సాగిస్తున్నారని గతంలో ఎన్నోసార్లు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఇష్టారాజ్యంగా తవ్వకాలు...

కోయచలక రెవెన్యూలో లీజు తీసుకుని అక్కడే కాకుండా చింతగుర్తి, రఘునాథపాలానికి చెందిన సర్వే నెంబర్లలోని గుట్టల్లోనూ ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు జరిపినట్లు స్థానికులు లిఖిత పూర్వక ఫిర్యాదులు అందాయి. ఐదేళ్ల పాటు మట్టిని తీసేందుకు గుత్తేదారులు అనుమతి ఉండగా.. ఈ ఏడాది మార్చి 20తో లీజు పూర్తయింది. నిబంధనల ప్రకారం లీజు పూర్తయిన తర్వాత మట్టి తవ్వకాలు ఆపేయాలి. మళ్లీ మైనింగ్ శాఖ అధికారులు అనుమతి ఇచ్చే వరకు ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదు. కానీ.. లీజు గడువు పూర్తయి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా మట్టి తవ్వకాలు జోరుగానే సాగుతున్నాయి.

ప్రభుత్వానికి రాయల్టీ పరంగా రావాల్సిన ఆదాయం రాకపోగా..గుత్తేదారులు మాత్రం మట్టి తరలింపు పేరిట రూ.కోట్లు కూడబెట్టుకుంటున్నారు. మట్టి తవ్వకాలు నిబంధనల ప్రకారం సాగుతున్నాయా..లేదా అన్నది పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవటం గుత్తేదారులకు వరంగా మారింది.

లోకాయుక్తకు నివేదన...

కోయచలక రెవెన్యూలో గుట్టల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడమే కాకుండా అనుమతులు పొందిన 4 హెక్టార్లలో కాకుండా మరికొన్ని వేర్వేరు సర్వే నెంబర్లలోమట్టి తవ్వకాలు సాగిస్తున్నారంటూ లోకాయుక్తకు స్థానికులు ఫిర్యాదు చేశారు. రఘునాథపాలెంకు చెందిన బానోత్ భద్రునాయక్, మందా బుచ్చిబాబు, పువ్వాడ ఉదయ్ నగర్​కు చెందిన ఉపేంద్ర, స్వాతి, నీల అనే మహిళలు 2018లో లోకాయుక్తను ఆశ్రయించారు. కేవలం నాలుగు హెక్టార్లలోనే లీజు అనుమతి పొంది వేర్వేరు సర్వే నెంబర్లలో దాదాపు వంద ఎకరాల్లో అదనంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సంపదను కొల్లగొట్టడమే కాకుండా పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారని లిఖితపూర్వకంగా లోకాయుక్తకు నివేదించారు.

తవ్వకాలే లేదని నివేదిక...

మట్టి ప్రభుత్వ సంపదను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2020లో విచారణ స్వీకరించిన లోకాయుక్త..ఫిర్యాదుదారుల అభ్యర్థన మేరకు విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. కోయచలక రెవెన్యూ పరిధిలో సాగుతున్న మట్టి తవ్వకాలపై ఈ నెల 3న స్వయంగా పరిశీలనకు వెళ్లినట్లు లోకాయుక్తకు నివేదిక అందజేసింది. జిల్లా మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా కొన్నిరోజుల క్రితం ఓ నివేదికను లోకాయుక్తకు అందజేశారు. అయితే.. ఈ నివేదికలో పొందుపరిచిన అంశాలు ఇప్పుడు విస్తుగొలుపుతున్నాయి. రోజూ వందలాది టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నప్పటికీ..అసలు అక్కడ మట్టి తవ్వకాలే జరగడం లేదని నివేదిక సమర్పించడం చర్చనీయాంశంగా మారుతోంది.

ఫిర్యాదుదారులు ఆరోపించిన ప్రదేశంలో అసలు మట్టి తవ్వకాలే జరగడం లేదని నివేదికలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా కొందరు అసైన్డు పట్టాలు పొందిన రైతులు పంటలు సాగు చేసుకునేందుకు భూమిని చదును చేసుకునేందుకు మట్టి తవ్వకాలు జరుపుతున్నారని నివేదికలో పొందుపరచడం నివ్వెరపరుస్తోంది.

ఇదీచూడండి:హుజూరాబాద్‌ నుంచే రెండో విడత గొర్రెల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details