రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న పోడు భూముల సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తోంది. ఇందుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేధిక ఆధారంగా తదుపరి కార్యాచరణ చేపట్టనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల ఎకరాల వరకు పోడు భూములకు సంబంధించిన సమస్య ఉన్నట్లు సమాచారం.
వచ్చిన సమస్య అదే..
2006లో అప్పటి సమైక్య రాష్ట్రంలో అటవీహక్కుల చట్టం పట్టాలు ఇచ్చిన సమయంలో 91 వేలకు పైగా దరఖాస్తులు తిరస్కరించారు. వాటి విస్తీర్ణం మూడు లక్షలా 20వేల ఎకరాలకు పైగా ఉంది. 50 వేల ఎకరాల విస్తీర్ణం మేరకు మరో 15 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటితో పాటు అదనంగా మరో మూడు లక్షలకు పైగా ఎకరాల్లోనూ ఈ సమస్య ఉంది. గతంలో దరఖాస్తులు తిరస్కరించినప్పటికీ దరఖాస్తుదారులకు సమాచారం ఇవ్వకపోవడం కూడా ఓ సమస్యగా మారినట్లు అధికారులు చెప్తున్నారు.
దరఖాస్తులు స్వీకరించి..
ఆర్ఓఎఫ్ఆర్ హక్కు దక్కాలంటే చట్టం వచ్చిన 2005 డిసెంబర్ 13వ తేదీ వరకు అంతకుముందు మూడు తరాలు 75 ఏళ్ల పాటు ఆ భూములను సాగు చేసుకుంటూ ఉండాలి. 2005 నుంచి ఇప్పటి వరకు మరో 16 ఏళ్లు అదనం. ఒక్కొక్కరికి గరిష్ఠంగా నాలుగు హెక్టార్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పోడు సాగుదార్ల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
23న సీఎం సమీక్ష..
ఇందుకు సంబంధించి ఈ నెల 23వ తేదీన సంబంధిత మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమశాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. సమస్యకు సంబంధించిన సమగ్ర అవగాహన కోసం అటవీ, గిరిజన సంక్షేమశాఖల ఉన్నతాధికారులు ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ జిల్లాలకు సంబంధించిన అధికారులతో ఇవాళ ఖమ్మం కలెక్టరేట్ లో సమావేశమవుతారు. నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి ఉట్నూరు ఐటీడీఏలో సమావేశం నిర్వహిస్తారు. ములుగు, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి 22వ తేదీన ములుగు కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తారు. జిల్లాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తారు. వాటి ఆధారంగా పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చిస్తారు.
ప్రజల భాగస్వామ్యంతోనే..
ఇదే సమయంలో అడవుల పరిరక్షణ కోసం కూడా కార్యాచరణ అమలు చేయనున్నారు. పోడుకు పోగా మిగిలిన అటవీ ప్రాంతాలను పూర్తి స్థాయిలో రక్షించేలా, భవిష్యత్ లో అటవీవిస్తీర్ణం తగ్గకుండా ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇందుకు సంబంధించి కూడా ప్రజలను భాగస్వామ్యం చేయనున్నారు. ఆ షరతుతోనే పోడు సమస్యను పరిష్కరించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అటు ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఏడు విడతల హరితహారంపై కూడా సమీక్షించి మరింత విస్తృతంగా ఫలితాలు రాబట్టే కార్యాచరణపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.
ఇదీ చూడండి:
CM KCR: 'ముందు పోడు సాగుదారుల లెక్క తేల్చండి'