CM KCR Public Meetings Today : నామినేషన్ల ఘట్టం, దీపావళి పండుగ పూర్తి కావడంతో.. ఇక నేటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రచారం ఆఖరి రోజు వరకు నిర్విరామంగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. రెండు రోజులు మినహా.. మిగిలిన రోజుల్లో నాలుగు, మూడు నియోజకవర్గాలను సీఎం చుట్టేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో భాగంగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల బీఆర్ఎస్(BRS) అభ్యర్థులు రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావు, మెచ్చా నాగేశ్వరరావుకు మద్దతుగా.. రెండు బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు.
KCR Praja Ashirvada Sabha in Warangal : కేసీఆర్ తొలుత అశ్వారావుపేట ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సభ కోసం దమ్మపేట సమీపంలోని ఖాళీ స్థలంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మధ్యాహ్నం నేరుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్లో కేసీఆర్దిగి బహిరంగ సభలో పాల్గొంటారు. అశ్వారావుపేట సభ అనంతరం.. పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు కలిపి బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొంటారు. ఈ సభలకు భారీగా జనసమీకరణ చేసేలా ఏర్పాట్లు గులాబీ శ్రేణులు చేస్తున్నారు. ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో ముఖ్యమంత్రి సభలకు సన్నాహక సమావేశాలు ఏర్పాటు(CM KCR Meeting Arrangements) చేసి జనసమీకరణపై ముమ్మర కసరత్తులు పూర్తి చేశారు.
నేడు కొత్తగూడెం, ఖమ్మంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు - హాజరుకానున్న సీఎం కేసీఆర్
KCR Praja Ashirvada Sabha at Lakshmipuram : బహిరంగ సభకు రెండు నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తల్ని సమీకరించి సత్తా చాటేందుకు.. గులాబీ పార్టీ నేతలు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. పినపాక, భద్రాచలం అభ్యర్థులు రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావుతో పాటు ఎంపీలు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభల దృష్ట్యా పోలీసు శాఖ భారీ బందోబస్తు చర్యలు చేపట్టింది. సభా ప్రాంగణాలను భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్ పలుమార్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలిప్యాడ్ నుంచి.. సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని.. ఆదేశాలు జారీ చేశారు.