దేశాన్ని కార్పొరేట్ శక్తుల్లో పెట్టి, రైతు వెన్ను విరిచేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర నిర్ణయాలతో రైతులు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోతుండగా.. మద్దతు ధర ఊసెత్తని తెలంగాణ సర్కారు నిర్వాకంతో మరింతగా ఇబ్బందిపడుతున్నారని ఆక్షేపించారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధరలు ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో బుధవారం ‘రైతు పొలికేక’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అన్నదాతలు పంటను తగలబెట్టుకునే పరిస్థితి రావటం దారుణమని రేవంత్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెస్తామన్నారు. దుబ్బాక ఓటమితో కేసీఆర్ పని అయిపోయిందని, ఆయనపై తిరుగుబాటు మొదలైందన్నారు. సన్నాలకు రూ. 2500 మద్దతు ధర ప్రకటించాలన్న డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, సీనియర్ నేతలు వి.హన్మంతరావు, చిన్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్, గాలి వినోద్‌కుమార్, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస్‌కృష్ణన్, మధుయాస్కీ, భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.