రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులు, రైతులు, వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో పర్యటించిన భట్టి... ఉదయపు నడకలో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు సమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్త యాత్రను చేపడుతుందని ఆయన వివరించారు. తెరాస నేతలు ప్రజాధనాన్ని దోచుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని భట్టి ఆరోపించారు.
నగరంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని... అవినీతి నుంచి కాపాడటమే తమ లక్ష్యమని భట్టి అన్నారు. కాంగ్రెస్ నేతలు మాణికం ఠాగూర్, ఉత్తమ్ కుమార్లు ఖమ్మంలో ఆదివారం పర్యటిస్తారని... ఎన్నికల కార్యాచరణపై మాణికం ఠాగూర్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని... త్వరలోనే ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. సాగు చట్టాల రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.