సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సైకిల్ యాత్ర ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆ యాత్రలో ప్రజలు అనేక సమస్యల గురించి తనకు వివరించారని ఆయన తెలిపారు.
నాగార్జునసాగర్ ఎడమ కాలువపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద సంగమేశ్వర లిఫ్టు ఇరిగేషన్.. ఏపీ పాలకులు నిర్మించి రోజుకు 11 టీఎంసీల నీటిని తీసుకెళ్తున్నారని విమర్శించారు. దానిని ఆపకపోతే ఖమ్మం, నల్గొండ జిల్లాలు ఎడారిగా మారుతాయని ఆరోపించారు. పంటలు పండక రైతులు వలస పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసికట్టుగా ఉండి సంగమేశ్వరం వద్ద లిఫ్టు పనులు నిలిపివేయాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తిపడి 11 టీఎంసీల నీటిని ఆంధ్ర వాళ్లు తీసుకెళ్తుంటే చోద్యం చేస్తున్నాడని దుయ్యబట్టారు.
తెలంగాణ ఏర్పడింది ముఖ్యంగా నీళ్లు నియామకాల కోసం అని తెలిపారు. కానీ ఆ నీటిని తీసుకెెళ్తుంటే ముఖ్యమంత్రి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడని తెలిపారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస పార్టీలు వచ్చిన తర్వాత నిత్యావసర సరకుల ధరలు పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని... లేదంటే రైతులు అనేక ఇబ్బందులు పడతారని ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి :ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి: ఉత్తమ్