Podu lands issue in Khammam : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాణిక్యారం అటవీ ప్రాంతంలో పోడు రైతులు, అటవీ సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదం తోపులాటకు దారి తీసింది. మండలంలోని ఎర్రబోడుగుడితండా, మాణిక్యారం గ్రామాలకు చెందిన 10 మంది రైతులు సుమారు 30 ఎకరాల పోడు భూమిని సాగు చేసుకుంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం అటవీ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకొని మొక్కలు నాటారు. ఆ భూములకు బదులుగా ప్రత్యామ్నాయంగా మరోచోట భూములు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు.
ఇప్పటి వరకు భూములు కేటాయించకపోవడంతో తమ భూముల్లో అధికారులు నాటిన మొక్కలను తొలగించేందుకు రైతులు వచ్చారు. పలు మొక్కలను నరికేశారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడికి చేరుకొని రైతులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే రైతులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి.. తోపులాటకు దారితీసింది. అనంతరం మొక్కలు నరికిన 10 మంది రైతులపై అటవీ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రైతులను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భూముల వద్దకు వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించారు.