రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు మిరప రైతుల పాలిట శాపంగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు పెద్ద ఎత్తున తెగుళ్లు సోకడంతో... పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని మందులను పిచికారీ చేస్తున్నా.. మొక్క మొదళ్లలో పోస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదని వాపోతున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో కొన్నిచోట్ల 20 నుంచి 40 శాతం వరకు, మరికొన్ని చోట్ల సగం మేరకు వేలాది ఎకరాల్లో మొక్కలు చనిపోతుండడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
తెగుళ్ల రకాలు..
రాష్ట్రంలో 3,58,557 ఎకరాల్లో మిరప సాగవుతోంది. గతేడాది కంటే 1,17,765 ఎకరాల్లో అధికంగా సాగు చేపట్టారు. మిరప పంటలకు మూడు రకాల తెగుళ్లు వ్యాపించినట్లు మహబూబాబాద్ జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె.భాస్కర్ చెబుతున్నారు. ఒకటి ప్యూజరియం వడలు, ఎండు తెగులు వల్ల పూత, కాత రాలిపోయి, మొక్క తలలు వాల్చి ఆకులు పసుపు రంగుకు మారి మొక్క చనిపోతుంది. రెండోది వర్టిసిల్లియం. ఈ తెగులు ఆశించిన మొక్కలు చూడడానికి ఆకుపచ్చగానే ఉంటాయి. వడలిపోయి 2-3 రోజుల తర్వాత చనిపోతాయి. మూడోది వేరుకుళ్లు. తెగులు కారక శిలీంధ్రం ఆశించడంతో భూమి నుంచి నీటిని తీసుకోలేక ఎండిపోతాయి. వేరు పైభాగం పొరలుపొరలుగా ఊడి, తెల్లటి దట్టమైన బూజు పెరుగుతుంది. ఈ తెగులే ఎక్కువచోట్ల కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెగని వర్షాలు కురుస్తుండడం వల్ల పారే నీటి ద్వారా ఇది ఎక్కువగా వ్యాపిస్తుండవచ్చని వ్యవసాయరంగ నిపుణులు పేర్కొంటున్నారు.