తెలంగాణ

telangana

ETV Bharat / state

'పంద్రాగస్ట్ నాటికి వైకుంఠధామాల నిర్మాణం పూర్తి'

పుట్టిన ప్రతీ మనిషీ గిట్టక మానడు. జన్మించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో... పోయోటప్పుడూ అంతే ఆనందంగా అంతిమ వీడ్కోలు పలకాలనేది హిందూ సంప్రదాయం. కానీ ప్రస్తుతం పల్లెలు, పట్టణాలే కాదు అభివృద్ధి చెందిన నగరాల్లోనూ అంతిమ సంస్కారాలకు జాగలేని దయనీయ దుస్థితి. ఇక ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లోనైతే మరీ అధ్వాన పరిస్థితి. మనిషి చనిపోతే కనీసం ఆరు గజాల స్థలం కూడా దొరక్క దహన సంస్కారాలూ నిర్వహించలేని కాలం. వానాకాలంలోనైతే చెరువులు, కుంటలు, వాగులు వంకలు దాటి చనిపోయిన వారికి తుది వీడ్కోలు పలికే సంఘటనలు కోకొల్లలుగానే కనిపిస్తాయి. ఇక ఇదంతా గతం... గతించిన మనిషి ఆత్మను స్వర్గలోకానికి తీసుకెళ్లేలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణం జోరుగా సాగుతోంది.

By

Published : Jul 22, 2020, 12:29 AM IST

Updated : Jul 22, 2020, 3:39 AM IST

'పంద్రా ఆగస్ట్ నాటికి స్మశానవాటికల నిర్మాణం పూర్తి'
'పంద్రా ఆగస్ట్ నాటికి స్మశానవాటికల నిర్మాణం పూర్తి'

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైకుంఠధామాల నిర్మాణాలు జోరందుకున్నాయి. స్మశానవాటిక లేని పంచాయతీ ఉండకూడదన్న సదుద్దేశంతో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన శ్మశానవాటికలను అధికార యంత్రాంగం వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఆగస్టు 15 నాటికి గ్రామ గ్రామాన వైకుంఠధామాలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఎక్కువ గ్రామాల్లో నిర్మాణాల ప్రక్రియ ప్రారంభమై.. వేగంగా పనులు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల స్థలాల సమస్య తలెత్తడం వల్ల అక్కడ నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదు.

ఖమ్మం జిల్లా 387 గ్రామాల్లో...

ఖమ్మం జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 197 గ్రామాలు ఇప్పటికే స్మశాన వాటికల సౌకర్యం ఉంది. ఇంకా 387 పంచాయతీల్లో వైకుంఠ ధామాల నిర్మాణాలకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే 373 స్మశాన వాటికలకు అవసరమైన స్థలసేకరణ పూర్తై.. నిర్మాణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు జిల్లాలో 14 వైకుంఠ ధామాలు ఆయా గ్రామాల్లో అందుబాటులోకి వచ్చాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 400 గ్రామాల్లో...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481 గ్రామ పంచాయతీలకు గానూ స్మశానవాటికలు లేని 400 గ్రామాల్లో నిర్మాణాలు సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో స్మశానవాటికల కోసం కేటాయించిన భూములు అటవీ శాఖ పరిధిలో ఉండటం వల్ల జాప్యం జరుగుతోంది.

విశాలమైన వైకుంఠధామాల నిర్మాణం

అంతిమ సంస్కారాలు నిర్వహించే క్రతువులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా విశాలంగా వైకుంఠ ధామాల నిర్మాణాలు చేపడుతున్నారు. విశాలంగా ఉండేందకు ఎక్కువ స్థలం కేటాయించడం సహా అంత్యక్రియలు సజావుగా సాగేలా నిర్మిస్తున్నారు. జిల్లాల్లో కొన్నిచోట్ల దాతలు కూడా ఉచితంగా స్థలం ఇచ్చి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఒక్కో వైకుంఠధామం నిర్మాణానికి ప్రభుత్వం రూ.12.60 లక్షలు కేటాయించి, నిర్మాణాలు చేపడుతున్నారు. వైకుంఠధామంలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఆర్చి, రెండు దహనవాటికలు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, బోరు, మోటారు, ఓ కార్యాలయం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

వారి కోసం స్నానాల ఏర్పాట్లు...

అంతిమ సంస్కారాల కోసం వచ్చే వారంతా స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. స్మశానవాటిక చుట్టూ పచ్చదనం ఉండేలా మొక్కలు నాటుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే సత్తుపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా వైకుఠంధామాల నిర్మాణాలు కొనసాగుతుండగా... పెనుబల్లి మండలం పెద్దకారాయిగూడెం గ్రామంలో నిర్మించిన వైకుంఠధామంపై సీఎం కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించడం విశేషం.

జిల్లా యంత్రాంగం ప్రత్యేక నజర్...

ఉభయ జిల్లాల్లో అన్ని వైకుంఠధామాలు ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎప్పటికప్పుడు నిర్మాణాలపై కలెక్టర్ ఆర్​వీ కర్ణన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా ఏజెన్సీ పల్లెల్లో వైకుంఠథామాల నిర్మాణాలు పూర్తయితే... ఆయా గ్రామాల్లో అంతిమ సంస్కారాల సందర్భంగా ఎదురయ్యే కష్టాలు తీరనున్నాయి.

'పంద్రా ఆగస్ట్ నాటికి స్మశానవాటికల నిర్మాణం పూర్తి'

ఇవీ చూడండి : నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్​

Last Updated : Jul 22, 2020, 3:39 AM IST

ABOUT THE AUTHOR

...view details