పొంగులేటి అనుచరులపై బీఆర్ఎస్ బహిష్కరణ వేటు
20:08 February 05
వైరా నియోజకవర్గంలో 20 మంది నాయకులపై బీఆర్ఎస్ చర్యలు
ఖమ్మం జిల్లాలో పొంగులేటి అనుచరులపై బీఆర్ఎస్ బహిష్కరణ వేటు వేసింది. కొన్ని నెలలుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి అతను బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నాడు. తాజాగా వైరా నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను కలవడానికి వెళ్లారు. ఈ విషయం అధిష్ఠానానికి తెలియడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. క్రమశిక్షణ చర్యలకు పూనుకుంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన పొంగులేటి వర్గంపై బీఆర్ఎస్ బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది.
వైరా నియోజకవర్గంలో 20మంది నాయకులపై బీఆర్ఎస్ చర్యలు తీసుకుంది. రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్‌ను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించింది. వైరా పురపాలక ఛైర్మన్ జైపాల్‌తో పాటు 18 మందిని సస్పెండ్ చేసింది. గత కొన్ని రోజులుగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి, బీఆర్ఎస్ అధిష్ఠానికి మధ్య పొసగడం లేదు. మండల స్థాయి నాయకులతో మంతనాలు సాగిస్తున్న పొంగులేటి.. పార్టీ నుంచి దూరంగా జరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం దాదాపు 5 మండలాల నేతలు పొంగులేటితో సమావేశమయ్యారు. పలువురు ముఖ్య నేతలు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడంపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయా మండల పార్టీ అధ్యక్షులు ప్రకటించారు.
ఇవీ చదవండి: