Milk Bank in Khammam: తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష అంటారు. సకాలంలో బిడ్డకు పాలు పట్టిస్తే.. పోషక విలువలు మెండుగా లభిస్తాయంటారు. అయితే కొంత మంది మాతృమూర్తులకు.. ఒకటి, రెండు రోజుల వరకు పాలు పడవు. ఆ సమయంలో చేసేదేం లేక డబ్బాపాలు పడుతుంటారు. ఈ సమస్యను అధిగమించడానికే రాష్ట్ర సర్కార్.. పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా మిల్క్ బ్యాంక్‌లను ఏర్పాటు చేసింది.
ఖమ్మంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాతాశిశు సంరక్షణ కేంద్రం దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆస్పత్రిలో ప్రసవించిన తల్లులకు మొదటగా పాలదానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందువల్ల కలిగే ప్రయోజనాలను బాలింతలకు.. సిబ్బంది, నర్సులు వివరిస్తున్నారు. అవగాహన కల్పించడంతో ప్రతిరోజూ దాదాపు 25 మంది తల్లులు.. మిల్క్‌బ్యాంక్‌కు పాలదానం చేస్తున్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.
కొంతమంది బాలింతలకు అధిక పాలు ఉండటం వల్ల ఛాతీలో గడ్డలు ఏర్పడతాయి. దానివల్ల కొన్ని వ్యాధులు సైతం సంక్రమించే ప్రమాదం ఉంది. అలాంటి వారిని గుర్తించి.. వారి నుంచి మిల్క్ బ్యాంకు సిబ్బంది పాలను సేకరిస్తారు. ప్రత్యేక పద్దతుల్లో బ్యాక్టీరియాను తొలగించి నిల్వ చేస్తారు. కేంద్రంలో ఇప్పటివరకు 146 లీటర్ల తల్లి పాలను సేకరించామని.. ఆస్పత్రి సూపరిండెంట్ చెప్పారు. వాటిని అవసరమైన శిశువులకు అందించామని వివరించారు.
అన్నిపరీక్షలు నిర్వహించిన తర్వాతనే.. చిన్నారులకు పాలు అందజేస్తున్నట్లు తెలిపారు. పుట్టిన వెంటనే తల్లి పాలు అందని శిశువులకు.. ఆపర సంజీవనిలా ఖమ్మం మిల్క్‌బ్యాంక్ పనిచేస్తుంది. రోజు సుమారుగా 30 మంది నవజాత శిశువులకు పాలను అందజేస్తూ చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఆసుపత్రి సేవల్ని అంతా అభినందిస్తున్నారు.
"ప్రతి తల్లికి ఒక్కరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వారి వద్దనుంచి పాలు సేకరించి.. శిశు సంజీవనిలో ఉన్న పిల్లలందరికీ తల్లి పాలు అందేలాగా సర్వీసు చేస్తున్నాము. రోగ్య బారినపడిన పిల్లలు తల్లిపాలు లేకపోవడం వల్ల వారి ఆరోగ్యం, పెరుగుదల క్షీణిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో వారి ఎదుగుదలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా తల్లిపాలును అమృత పాల బ్యాంక్‌లో ఉంచి ఇస్తున్నాము. గర్భిణులు శిశువుకు జన్మనిచ్చిన తరవాత వారికి రెండు, మూడు రోజులు పాలు రాకపోతే ఈ అమృత బ్యాంక్‌కు వచ్చి.. తమ సమస్యను పరిష్కరించుకోగలరు." - డా.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి
"ఇక్కడకు బాలింతలు వస్తారు. వారిలో ఎక్కువగా తల్లి పాలు ఎవరికి ఉంటాయో వారు ఇక్కడ తమ పాలను డోనేట్ చేస్తారు. రోజుకీ 25 నుంచి 30 మంది వరకు తల్లులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఆ పాలను తీసుకొని స్టోర్ చేసి.. పాశ్చరైజ్ చేసి.. ల్యాబ్‌కు పంపిస్తాము. అక్కడ రిపోర్టు నెగిటివ్ అని వస్తే పాలును తీసుకుంటాము." - కృష్ణ వేణి, నర్సు
ఇవీ చదవండి: