BJP Meeting in Khammam Today : బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం, కాంగ్రెస్ ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణతో దూకుడు కొనసాగిస్తుడటంతో.. ఖమ్మం గడ్డపై నుంచి అసెంబ్లీ పోరుకు బీజేపీ(BJP) సమర భేరీ మోగించనుంది. సాయంత్రం "రైతు గోస-బీజేపీ భరోసా" పేరిట నిర్వహించే బహిరంగ సభ వేదికగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకోనున్న అమిత్ షా.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో దిగుతారు. తర్వాత సభా ప్రాంగణంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొని వచ్చే ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. దాదాపు 20 మంది వరకు ముఖ్యనేతలు ఆ భేటీలో పాల్గొననున్నారు.
Amith Shah Khammam Tour :బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు దీటుగా ముందుకెళ్లేలా.. పార్టీ నేతలకు కీలకమైన సూచనలు చేసే అవకాశం ఉంది. అనంతరం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. ప్రస్తుత జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజకీయాల నేపథ్యంలో అమిత్‌షా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
బీజేపీ-బీఆర్ఎస్(BRS) మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందన్న కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టేలా ప్రసంగం సాగే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీజేపీకి మద్దతిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌తెలిపారు. తొలిసారి అమిత్ షా ఖమ్మం వస్తుండటంతో బహిరంగ సభ విజయవంతానికి కమలం నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు.