BJP Leaders Meets Ponguleti Srinivas: బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీ.. ఇప్పటి వరకు పార్టీకి పట్టులేని జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీని విస్తరించే లక్ష్యంతో కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ముఖ్యనేతల బృందం నేడు ఖమ్మం వెళ్లి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో సమావేశం కానుంది. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యంగా బీజేపీ నేతల పర్యటన సాగనున్నట్లు తెలుస్తోంది.
BJP Leaders Meets Ponguleti Srinivas Today: రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీతోనే సాధ్యమన్న సంకేతాన్నివ్వడం సహా.. పార్టీలో చేరాలని ఆహ్వానించే అవకాశం ఉంది. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురయ్యాక బీజేపీలోకి రావాలని ఈటల రాజేందర్ పలుమార్లు పొంగులేటిని ఆహ్వానించినట్లు గతంలో ప్రచారం సాగింది. అయితే రెండు జాతీయ పార్టీల ముఖ్యనేతలు సంప్రదిస్తున్నారని మాజీ ఎంపీ పలుమార్లు చెప్పారు. ఈటల రాజేందర్ తనకి అత్యంత ఆత్మీయమిత్రుడని పేర్కొన్నారు. ఈ తరుణంలో పొంగులేటి.. బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది.
ఆ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వబోను: రెండు జిల్లాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయ్యాక నాయకులు, అనుచరుల అభీష్టం మేరకు పార్టీమార్పుపై.. నిర్ణయం తీసుకుంటానని పొంగులేటి చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు సంప్రదించినట్లు వార్తలొచ్చినా.. అవి ఊహాగానాలేనని పొంగులేటి తెలిపారు. బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి రాకుండా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాకుండా చేసే పార్టీలోకి వెళ్తానన్న పొంగులేటి.. ఉభయ ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని శపథంతో జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కాయి.