Bhatti Vikramarka Padayatra in Khammam district : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పేరుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. ముదిగొండ మండలం బాణాపురం నుంచి వల్లభి గ్రామానికి వెళ్తుండగా మార్గంమధ్యలో తాటి వనాల వద్ద కల్లుగీత కార్మికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రోడ్డు పక్కన వారు వేసుకున్న పాకలోకి భట్టిని తీసుకెళ్లారు. గీత కార్మికుల సమస్యల గురించి ఏకరువు పెట్టారు. ప్రభుత్వం తాటిచెట్లు ఎక్కడానికి ఎలక్ట్రానిక్ మోకులు ఇస్తామని చెప్పి... ఇవ్వడం లేదన్నారు. మత్స్య కార్మికులు చేపలు పట్టుకుని అమ్మడానికి టీవీఎస్ వాహనాలు ఇచ్చిందని... తమకు కూడా ఇవ్వాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కల్లు రుచి చూసిన భట్టి..
అర్హులైన సభ్యులందరికీ లైసెన్సులు ఇవ్వడం లేదన్నారు. తాటి చెట్టు పై నుంచి పడి చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ఏడాదైనా పరిహారం రావడంలేదని వాపోయారు. తాటి వనాల పెంపకం కోసం సొసైటీలకు కేటాయిస్తామని ప్రకటించినా... మూడు ఎకరాల భూమి కూడా ఇవ్వకపోవడంతో భవిష్యత్తులో తమ వృత్తి మనుగడ లేకుండా పోయే ముప్పు ఉందని వివరించారు.