Bhatti Fires on BRS Government : మేనిఫెస్టో పేరిట మరోసారి రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించి దగా చేసేందుకు బయలుదేరిన భారత రాష్ట్ర సమితి(BRS) ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
Bhatti Vikramarka on Congress 6 Guarantees : ఖమ్మం జిల్లా చింతకాని మండలం అనంతసాగరంలో కాంగ్రెస్ బూత్ స్థాయి నాయకుల(Congress Booth Level Leaders)తో భట్టి సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల(Congress 6 Guarantees)ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం నిర్వహించిన సీఎల్పీ నేత భట్టి మాట్లాడారు. బీజేపీకు బీఆర్ఎస్ బీ-టీమ్ గానే వ్యవహరిస్తుందని వీరికి ఎంఐఎం భజన చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకు వేసినట్లేనని విమర్శించారు.
Bhatti Comments on BRS Manifesto : రాష్ట్ర వనరులు, సంపద ప్రజలకు చెందకుండా బీఆర్ఎస్ దోచుకుంటోందని భట్టి మండిపడ్డారు. హైదరాబాద్ చుట్టూ భూముల్ని అప్పనంగా అమ్మేసుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల్ని 30 ఏళ్ల పాటు లీజులకు ఇచ్చి ప్రభుత్వ ఆదాయం ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారని పేర్కొన్నారు. దోపిడీ ప్రభుత్వాన్ని వదిలించుకొని.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
'దోపిడీ పాలకులను తెలంగాణ సమాజం నుంచి తరిమి కొట్టాలి. తెలంగాణ తెచ్చుకున్నది దొరలు, దోపిడీదారుల కోసం కాదు. ఓటు హక్కు వినియోగించుకొని దోపిడీదారులకు బుద్ధి చెప్పాలి. బీజేపీకి బీటీమ్‌లా బీఆర్ఎస్ పనిచేస్తోంది.. ఎమ్‌ఐఎమ్ సహకరిస్తోంది. బీఆర్ఎస్కు ఓటు వేస్తే.. బీజేపీకు ఓటు వేసినట్లే. ప్రభుత్వ ఆస్తులన్నింటిని కేంద్ర ప్రభుత్వం అమ్ముకుంటుంది. తెలంగాణలో భూములను కేసీఆర్ అమ్ముకుంటున్నారు. రింగ్‌రోడ్డుపై రాబోయే 30 ఏళ్ల ఆదాయాన్ని ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు. బీసీ బంధు బీసీలందరికీ ఇవ్వకుండా.. మీకు కావాల్సిన వారికి మాత్రమే ఇస్తున్నారు.' -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత