రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. పెత్తరమాస రోజు ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు మొదలవగా.. తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ శోభ ఉట్టిపడింది. రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. రంగు రంగుల పూలను ఒద్దికగా పేర్చి.. రాగయుక్తమైన పాటలకు లయబద్దమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు.
బతుకమ్మ వేడుకల్లో గవర్నర్
రాజ్‌భవన్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళిసై, ఆమె కుటుంబసభ్యులు పాల్గొన్నారు. దాదాపుగా మూడుగంటలపాటు బతుకమ్మ ఆడారు. కూకట్‌పల్లిలోనూ యువతులు, మహిళలు, చిన్నారులు సంతోషంగా బతుకమ్మ వేడుకల్లో భాగస్వామ్యులయ్యారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
ఉమ్మడి వరంగల్‌లో జిల్లాల్లోని ఊరువాడా బతుకమ్మ సంబురాలతో మురిసిపోయింది. హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయం తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో పూలవనంలా మారింది. వేలాదిగా తరలివచ్చిన మహిళలతో సందడిగా మారింది. బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ హొరెత్తించారు.
మెదక్ జిల్లాలో..
బతుకమ్మ సంబరాలు ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ ఘనంగా జరిగాయి. బతుకమ్మలను అందంగా పేర్చి కోదండ రామాలయం బాలాజీ మందిరంతో పాటు వివిధ కూడళ్లు, కాలనీల వద్ద బతుకమ్మ ఆడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.