bank officers locked farmers homes : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గరిడేపల్లి, బర్లగూడెంలో... డీసీసీబీ అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న రుణం కట్టలేదని... ఇళ్లకు తాళాలు వేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు మిర్చి పంటకు తామర పురుగు ఆశించి పంట దెబ్బతింటే... బ్యాంకు అధికారులు రుణాలు కట్టాలంటూ ఇళ్లకు తాళాలు వేసి వేధిస్తున్నారని వాపోతున్నారు.
రూ.పదివేల రుణానికి ఇంటికి తాళం
గ్రామంలో నలుగురు రైతుల ఇళ్లను బ్యాంకు అధికారులు సీజ్ చేయడంతో... కొవిడ్ వేళ ఎవ్వరూ ఇంటికి రానివ్వకపోవడంతో... రాత్రి ఇళ్ల ముందే చలిలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని కంటతడి పెట్టుకున్నారు. కొందరు కౌలు రైతులు రెండు, మూడేళ్ల క్రితం డీసీసీబీ నందు రూ.10వేల చొప్పున రుణాలు తీసుకున్నారు. వాటిని చెల్లించకపోవడంతో.. బ్యాంకు అధికారులు పలుమార్లు వారికి నోటీసులు జారీ చేశారు. తీసుకున్న రుణం కట్టనివారి ఇళ్లకు తాళాలు వేశారు.
మహిళా రైతు కంటతడి
కరోనా కాలంలో ఉన్నఫలంగా ఇంటికి తాళాలు వేయడంతో... పిల్లలు తిండి లేక పస్తులతో పడుకున్నారని.. ఓ మహిళా రైతు కన్నీటిపర్యంతం అయ్యారు. కొందరు బాధితులు చేనుకు వెళ్లిన సమయంలో... తాళాలు వేయడంతో ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది.
మేం లోన్ తీసుకున్నం. కొంత కట్టినం. కొంత ఆగినయ్. మేం ఇంటి దగ్గర లేని సమయంలో తాళం వేసి పోయారు. అన్నం లేదు ఏం లేదు. ఈ చలిలో బయట పడుకున్నాం. పిల్లలు చలికి అల్లాడిపోయారు. సగం ఆగితేనే ఇంత దారుణంగా చేస్తారా? అసలే కరోనా టైం. చిన్న పిల్లలు ఉన్న మమ్మల్ని ఇలా చేస్తారా?