BJP Nirudyoga March In Khammam : ఖమ్మంలో బీజేపీ నిరుద్యోగ మార్చ్ నిర్వహించింది. జడ్పీ సెంటర్ నుంచి మయూరి సెంటర్ వరకు బండి సంజయ్ ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. ఈ ప్రదర్శనలో పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను లేపేందుకు కొన్ని పత్రికలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. అయినా బీజేపీ విజయపరంపర ఆగదని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్ అందరినీ మోసం చేశారు : దొంగ దీక్షతో కేసీఆర్ అందరినీ మోసం చేశారని బండి సంజయ్ విమర్శించారు. ఓయూ విద్యార్థులు తిరగబడటంతో మళ్లీ దీక్షను కొనసాగించారని దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగాలు లేవని.. కానీ కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు ఉన్నాయని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ విషయంలో ఇద్దరే నిందితులని కేటీఆర్ చెప్పారని.. కానీ ఇప్పటి వరకూ 50 మంది దాకా అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తప్పు చేయకుంటే ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 30 లక్షల మంది యువత భవిష్యత్‌ను నాశనం చేశారని అన్నారు.
టీఎస్పీఎస్సీపై మాట్లాడినందుకు.. తననుపదోతరగతి ప్రశ్నాపత్రంను లీక్ చేశానని.. అరెస్ట్ చేసి జైలుకు పంపారని బండి సంజయ్ దుయ్యబట్టారు. కానీతాను భయపడనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఎవ్వరూ సంతోషంగా లేరని ఆరోపించారు. రైతులు రుణమాఫీ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అకాలవర్షాల నష్టపోయిన అన్నదాతలకు ఇస్తానన్న పరిహారంను కేసీఆర్ ఇంతవరకూ ఇవ్వలేదని బండి సంజయ్ ధ్వజమెత్తారు.