ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసరా లబ్ధిదారులకు 3 నెలలుగా పింఛన్లు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రతి నెల వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, నేత కార్మికులకు పింఛను అందిస్తోంది. ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకూ ఆసరా అందుతోంది. సర్కారు ఇచ్చే పింఛను సొమ్ము ఎంతోమందికి ఆర్థికంగా అండగా ఉంటోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 3 లక్షల 17 వేలకు పైగా ఆసరా లబ్ధిదారులు ఉన్నారు.
సరైన సమయంలో పింఛన్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పింఛను లబ్ధిదారులకు డబ్బులు నేరుగా ఖాతాల్లో జమయ్యేలా ప్రభుత్వం ఆన్‌లైన్ చేసింది. సాధారణంగా పింఛన్ సొమ్ము నెల నెల చివరి వరకూ ఖాతాల్లో జమవుతుంది. అయితే గత మూడు నెలలుగా డబ్బు జమ కాకపోవంతో ఆసరా సొమ్ముపైనే ఆధారపడి ఉన్న లబ్ధిదారులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 నెలలుగా పింఛన్లు అందకపోవడంతో ఆ డబ్బులపైనే ఆధారపడి ఉన్న వృద్ధులు, వికలాంగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.