Pranahitha Pushkaralu: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మడిహెట్టి వద్ద గత పుష్కరాలకు ఏర్పాటు చేసిన పుష్కరఘాట్ శిథిలావస్థకు చేరింది. కౌటాల మండల కేంద్రం నుంచి తుమ్మడిహెట్టికి వెళ్లే దారి గుంతలమయంగా మారింది. గ్రామం నుంచి నదీ తీరం వరకు కూడా రహదారి నిర్మించాలి.
తెలంగాణలో పుట్టి గోదావరిలో సంగమించే నది ప్రాణహితకు పుష్కరాలు దగ్గర పడుతున్నా ఏర్పాట్లేవీ మొదలుకాకపోవడం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. వచ్చేనెల 13 నుంచి 24 వరకు ఈ నదికి పుష్కరాలు జరగనున్నాయి. ముహూర్తం దగ్గర పడుతున్నా.. స్నానాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు, నిర్వహణపై ఒక్కడుగూ ముందుకు పడలేదు. 2010లో జరిగిన పుష్కరాల్లో రోజుకు 50 వేల నుంచి లక్షమంది వరకు పుణ్యస్నానాలు ఆచరించారు. అప్పట్లో సరైన రవాణా సౌకర్యాలు లేవు. ఇప్పుడు మెరుగయ్యాయి. మంచిర్యాల జిల్లా పరిధిలోని అర్జునగుట్ట-సిరోంచా (మహారాష్ట్ర) మధ్య ప్రాణహిత నదిపై, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం-సిరోంచా మధ్య గోదావరి నదిపై వంతెనలు నిర్మించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై వంతెనలు ఏర్పాటు చేయడంతో రవాణా మెరుగైంది. దీంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
చేయాల్సిన మరిన్ని ఏర్పాట్లు..
- గత పుష్కరాల సమయంలో అర్జునగుట్ట-సిరోంచ వద్ద రేవు ఉండేది. ఈ రేవుకు సమీపంలోని రాపన్‌పల్లి వద్ద ప్రాణహిత నదిపై వంతెన నిర్మించారు. ఇప్పుడా వంతెనకు ఇరువైపులా కొత్తగా రెండు స్నానఘట్టాలు, దేవులవాడ సమీపంలో వీఐపీ పుష్కరఘాట్‌ను ప్రతిపాదించారు.
- వేమనపల్లి వద్ద కూడా పుష్కరఘాట్ ప్రతిపాదించారు. కోటపల్లి మండలంలోని ఆల్గాం, పుల్లగామ, సిర్సా, వెంచపల్లి తదితర గ్రామాలకు నదీతీరం వరకు మట్టి రోడ్లు ప్రతిపాదించారు. ఇక్కడా తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.
- గోదావరి తీరంలో, కాళేశ్వరం ఆలయంలో భారీగా చలువ పందిళ్లు వేయాలి, విద్యుత్తు దీపాలు పెట్టాలి. తాత్కాలిక మరుగుదొడ్లు, ఆలయం వద్ద క్యూ లైన్ నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది.
- ప్రముఖుల ఘాట్ వద్ద మెట్లను విస్తరించాలని ప్రతిపాదించారు. తాగునీరు, సీసీ కెమెరాలు, జల్లు స్నానాలకు షవర్లు తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
పుష్కరాలకు ప్రతిపాదనలు...