BRS public meeting Khammam: బీఆర్ఎస్ తొలి బహిరంగసభపై పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. ఈనెల18న సభ ఘనంగా నిర్వహించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రగతిభవన్‌లో జిల్లాప్రజాప్రతినిధులు సహా పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. సభకు 5 లక్షల మందిని సమీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు పొరుగురాష్ట్రాలనుంచి ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జరగనున్న తొలి బహిరంగ సభ కాబట్టి అత్యంత ఘనంగా, దేశవ్యాప్తచర్చ జరిగేలా జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సుమారు 3 లక్షలకు పైగా హాజరు కావాలని ఒక్కో నియోజకవర్గానికి కనీసం 30 వేల నుంచి 40 వేల మంది జనసమీకరణ ఉండాలని గులాబీ దళపతి స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక ప్రజాప్రతినిధికి బాధ్యతలు అప్పగించారు. సభ నిర్వహణబాధ్యతను మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. నేడో, రేపో మంత్రి హరీశ్‌రావును.. ఖమ్మం వెళ్లాలని కేసీఆర్ సూచించారు.
ఖమ్మంలో సుమారు 100 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు కలెక్టర్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ సభకు దిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన విపక్ష నేతలను ఆహ్వానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒకే అసెంబ్లీ సీటులో గెలవడం, పార్టీ నేతల మధ్య విబేధాలు ఉన్నందున.. అక్కడ భారాస బలప్రదర్శన ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపొచ్చునని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.