తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణిపై రష్యా-ఉక్రెయిన్​ వార్​ ఎఫెక్ట్​.. తగ్గిన అమ్మోనియం నైట్రేట్‌ దిగుమతులు

Ammonium Nitrate Imports Reduced: రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లైంది. ఆ రెండు దేశాల నుంచి మన దేశానికి పెద్ద ఎత్తున దిగుమతయ్యే అమ్మోనియం నైట్రేట్‌ (ఎన్‌హెచ్‌4ఎన్‌ఓ3) సరఫరాలు మందగించాయి. పేలుడు పదార్థాల్లో ప్రధాన ముడిసరకైన అమ్మోనియం నైట్రేట్​ దిగుమతులు తగ్గడంతో దేశంలోని బొగ్గుగనుల తవ్వకాలపై ప్రభావం పడుతోంది.

ammonia nitrate imports
అమ్మోనియం నైట్రేట్‌ దిగుమతులు

By

Published : Mar 14, 2022, 7:50 AM IST

Ammonium Nitrate Imports Reduced : ఉక్రెయిన్​పై రష్యా బాంబుల యుద్ధంతో.. దేశంలో అమ్మోనియం నైట్రేట్‌ దిగుమతులు భారీగా తగ్గాయి. ఫలితంగా పేలుడు పదార్థాల కొరతతో బొగ్గు తవ్వకాలకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దాదాపు 30 లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం కలుగుతోంది.

చేతులెత్తేస్తున్న సరఫరాదారులు

Ammonium Nitrate Imports From Russia : తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నుంచి బొగ్గును వెలికి తీసేందుకు ముందుగా పేలుళ్లు జరిపి భారీఎత్తున మట్టిని తొలగించాలి. సగటున టన్ను బొగ్గు తవ్వాలంటే 7 టన్నుల మట్టిని వెలికితీయాలి. ఈ క్రమంలో సంస్థకు రోజుకు 750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ అవసరం. సంస్థ సొంతంగా 150 టన్నులు తయారు చేసుకుంటోంది. ప్రైవేటు సరఫరాదారుల నుంచి అతికష్టమ్మీద రోజూ మరో 300 టన్నులు సరఫరా అవుతోంది. మిగిలిన 300 టన్నులు దొరక్క సింగరేణి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సరఫరాదారులతో తరచూ సమావేశాలు జరుపుతున్నా యుద్ధం వల్ల తామేం చేయలేకపోతున్నట్లు వారు చేతులెత్తేస్తున్నారు.

ఎంత అవసరం?

Ammonium Nitrate Imports From Ukraine : ఏటా మనదేశంలో కోల్‌ఇండియా, సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలకు అవసరమైన పేలుడు పదార్థాల తయారీకి 11.50 లక్షల టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ అవసరం. ఇందులో 3 లక్షల టన్నులకు పైగా ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో ఉక్రెయిన్‌, రష్యాలదే సింహభాగం.

భారీగా తగ్గుతున్న ఉత్పత్తి

Ammonium Nitrate Imports Decreased : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-23)లో 6.80 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి తొలుత లక్ష్యంగా పెట్టుకుంది. పేలుడు పదార్థాల కొరత వల్ల పేలుళ్లు జరపలేక, మట్టి తవ్వలేక 30 లక్షల టన్నుల వరకూ బొగ్గు ఉత్పత్తి తగ్గవచ్చని అంచనా.

బొగ్గు ధరలు పెరిగి విద్యుదుత్పత్తిపై భారం

పేలుడు పదార్థాల ధరలు భారీగా పెరగడం వల్ల వాటి కొనుగోళ్లకు అవుతున్న అధిక వ్యయాన్ని భరించలేక బొగ్గు విక్రయధరలను సింగరేణి పెంచుతోంది. ఎక్కువ ధరలకు బొగ్గు కొంటున్న విద్యుత్​ కేంద్రాలు ఆ భారాన్ని కరెంటు కొనుగోలు సంస్థలపై మోపుతున్నాయి. అంతిమంగా విద్యుత్‌ వినియోగదారులపై ఈ భారం పడనుంది.

భారీగా పెరిగిన ధరలు

యుద్ధానికి ముందు నుంచే స్వల్పంగా పెరుగుతూ వస్తున్న అమ్మోనియం నైట్రేట్‌ ధరలు గత రెండు నెలలుగా నింగిని తాకుతున్నాయి. 2020 జులైలో టన్ను ధర రూ.25,500 ఉండగా 2021 సెప్టెంబరులో రూ.40 వేలకు, ఇప్పుడు రూ.71 వేలకు చేరింది. అమ్మోనియం నైట్రేట్‌ తయారీలో ఉపయోగించే నైట్రిక్‌ ఆమ్లం ధర కిలో లీటరు 2 నెలల క్రితం రూ.25 వేలుంటే ఇప్పుడు రూ.36 వేలకు చేరింది.

ఇదీ చదవండి:'కంటోన్మెంట్ కరెంట్ కట్ చేస్తే.. కేసీఆర్ పవర్ కట్ చేయడం ఖాయం'

ABOUT THE AUTHOR

...view details