Amit Shah Attends BJP Public Meeting in Khammam :రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది. ప్రధాన పార్టీలు రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల కోసం తన వ్యూహాన్ని రెడీ చేసుకుంటోంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంటే.. ఎలాగైనా ఈసారి తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇకపోతే కాంగ్రెస్ సైతం తెలంగాణ గద్దెపై తమ జెండాని ఎగురవేయాలని చూస్తోంది.
BJP Public Meeting In Khammam :ముఖ్యంగాబీజేపీ.. కేసీఆర్ను గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తన వ్యూహాన్ని ఇప్పటికే రచించింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్రతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్లగా.. తాజాగా మహాజన్ సంపర్క్ అభియాన్ పేరిట మరోసారి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
Amit Shah Telangana Tour Schedule : మహాజన్ సంపర్క్ అభియాన్ పేరిట.. తొమ్మిదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా.. బీజేపీ భారీ బహిరంగ సభలకు శ్రీకారం చుట్టింది. ఈ బహిరంగ సభలకు అన్ని వర్గాల ప్రజలను సమీకరించి కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొత్తం 3 బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్న బీజేపీ.. తొలి సభను ఖమ్మం వేదికగా నిర్వహిస్తోంది. రెండో బహిరంగ సభ నాగర్కర్నూల్లో నిర్వహించనున్నారు. మూడో బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలన్న దానిపై కసరత్తులు చేస్తున్నారు.