తెలంగాణ

telangana

ETV Bharat / state

khammam municipality: మసకబారుతున్న ఖమ్మం బల్దియా ప్రతిష్ఠ.. అధికారుల పర్సంటేజీ దందా..! - ఖమ్మం వార్తలు

ఖమ్మం నగరపాలక సంస్థలో (Khammam Municipal Corporation) వారు వీరు అన్న తేడాలేకుండా సాగుతున్న కమిషన్ల గోల బల్దియా పరువును బజారున పడేస్తోంది. ఓ వైపు నగరం అభివృద్ధిలో (development works in khammam)వేగంగా దూసుకుపోతుంటే..అంతే స్థాయిలో నగరపాలక సిబ్బంది, అధికారులపై అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. ఇప్పుడివన్నీ నగరపాలక సంస్థకు మాయని మచ్చలా తయారయ్యాయి. బల్దియాలో కొందరు అధికారులు, సిబ్బంది పర్సంటేజీల కోసం వేధింపులకు గురిచేస్తున్నారంటూ నేరుగా నగరపాలక సంస్థ కమిషనర్​కు ఫిర్యాదులు అందడం చర్చనీయాంశంగా మారింది.

khammam municipality
khammam municipality

By

Published : Nov 19, 2021, 7:48 PM IST

  • ఖమ్మం నగరంలోని ఓ ప్రాంతంలో మురుగు కాల్వ నిర్మాణానికి సంబంధించి రూ.5.5 లక్షల పనులు పూర్తి చేసిన ఓ గుత్తేదారు బిల్లు మంజూరీ కోసం కార్యాలయంలో ఎంబీ (M.Book) సమర్పించారు. పనులు పూర్తయినట్లు ఎంబీతో సహా ఫోటోలతో బిల్లు దస్త్రాన్ని ఓడీఈకి అందించారు. సదరు దస్త్రాన్ని స్వీకరించిన డీఈ గుత్తేదారు నుంచి భారీగా పర్సంటేజీ డిమాండ్ చేశారు. అంత సమర్పించుకోలేనని ప్రతిసారీ ఇచ్చే పర్సంటేజీ (Percentage) ఇస్తానని గుత్తేదారు చెప్పినా సదరు డీఈ వినలేదు. బిల్లు దస్త్రాన్ని పరిశీలించి చెల్లింపుల మంజూరీకి ప్రతిపాదించాల్సి ఉన్నా గుత్తేదారును కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. విసిగిపోయిన ఆ గత్తేదారు డీఈ పర్సంటేజీల వేధింపులపై ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు.
  • నగరంలో చేపట్టిన ఓ అభివృద్ది పనికి సంబంధించిన పనులను పర్యవేక్షించడంలో ఓ ఇంజినీర్ పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. పనులు నిర్దేశించిన సమయంలో పూర్తయ్యేలా చూడాల్సిన సదరు ఇంజినీర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై నగరపాలక కమిషనర్ (Khammam Municipal Commissioner) ఆదర్శ్ సురభి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఇంజినీర్​కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
  • ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన మరో ఇంజినీర్​కు కూడా కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఇలా నగరపాలకంలో పలువురు అధికారులపై అవినీతి ఆరోపణలకు తోడు విధుల్లో నిర్లక్ష్యం వంటి పరిణామాలు బల్దియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

లక్ష్మీ కటాక్షం లేకపోతే.. ముందుకు కదలడం లేదు..

అభివృద్ధి పేరిట సాగుతున్న పనుల బిల్లుల చెల్లింపుల్లో ముందుగా పర్సంటేజీల లెక్కలు తేల్చనిదే దస్త్రం కదలని పరిస్థితి నెలకొంది. పనులు పర్యవేక్షించే అధికారి నుంచి గణాంక విభాగంలో పనిచేసే వారి వరకు ఎవరికి ముట్టచెప్పాల్సిన మొత్తం వారికి అందితేనే బిల్లుల దస్త్రం కదులుతుంది. ప్రధానంగా ఇంజినీరింగ్, గణాంక విభాగం, రెవెన్యూ విభాగంలో (revenue department) కొంతమంది పర్సంటేజీలు లేనిదే బిల్లు దస్త్రం పట్టుకోవడం లేదు. మూడు విభాగాల్లో పనిచేసే అధికారుల్లో కొంతమంది దగ్గరకు బిల్లుల దస్త్రం వచ్చిందంటే పండగ చేసుకుంటున్నారు. ఎవ్వరూ చెప్పినా వినకుండా తమ పర్సంటేజీల లెక్కలు తేల్చిన తర్వాతే దస్త్రం ముందుకు కదులుతుందని కరాఖండిగా చెబుతుండటంతో గుత్తేదారులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏఈ, డీఈలకు 3 శాతం, కిందిస్థాయి సిబ్బందికి ఒక శాతం, గణాంక విభాగంలో 0.5 శాతం ప్రస్తుతం ఇలా పర్సంటేజీలు చెల్లించిన దస్త్రాలే బిల్లుల మంజూరీ కోసం ముందుకు కదులుతున్నాయి. ఒకవేళ కాదు కుదరదు అంటే ఆ బిల్లు దస్త్రాలకు నెలల తరబడి మోక్షం దక్కడం లేదన్నది బల్దియాలో వినిపిస్తున్న మాట.

చేతులు తడిపిన వారికి కాసులు వదులుతున్నారు

నగరంలో 60 డివిజన్ల వారీగా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయి. మురుగుకాల్వల నిర్మాణం (Construction of sewers), సీసీ రోడ్లు (cc roads), బీటీ రోడ్లు (bt roads), రహదారుల విస్తరణ, కల్వర్టు పనులు, ప్యాచ్ పనులు సాగుతున్నాయి. ఈ పనులకు సంబంధించి గుత్తేదారులు ఎప్పటికప్పుడు పురోగతిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. చిన్న పనులైతే ఒకేసారి, పెద్ద పనులైతే దశల వారీగా ఎంబీలు సమర్పిస్తారు. ఈ దస్త్రం సంబంధిత అధికారులకు చేరగానే ఆ పనుల పురోగతిని పర్యవేక్షించాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు ప్లాన్ ప్రకారం జరిగాయా లేదా అన్నది పర్యవేక్షంచాలి. పనులు మొత్తం పూర్తయ్యాక ఎంబీ సమర్పిస్తే అందుకు సంబంధించిన బిల్లుల మంజూరీ దస్త్రం ముందుకు కదలాలి. కానీ ఇందుకు విరుద్ధంగా బల్దియాలో కొంతమంది పర్సంటేజీలు ఇచ్చిన దస్త్రాలే ముందుకు కదుపుతున్నారు. డబ్బులు ఇవ్వని వారి పనుల దస్త్రాలు నెలల తరబడి కార్యాలయంలోనే మూలుగుతున్నాయి.

విభాగాలు మారినా.. మారని తీరు

వాస్తవానికి వరుస ప్రకారం బిల్లుల దస్త్రం ముందుకు కదలాలి. తప్పుడు బిల్లులు సమర్పిస్తే తిరస్కరించి వెనక్కి పంపడం, పనుల్లో నాణ్యత లేకపోయినా తిరస్కరించడం చేయాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా పర్సంటేజీలు ముట్టచెప్పిన గుత్తేదారుల బిల్లులు త్వరగా మంజూరు చేస్తూ కమీషన్లు సమర్పించుకోని వారివి మాత్రం పక్కనపెట్టడం బల్దియాలో పరిపాటిగా మారింది. ఇందులో ఒకరిద్దరు డీఈలు భారీగా పర్సంటేజీలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే విభాగాలు మార్చినప్పటికీ వారి పనితీరులో మార్పు రాలేదు. ఫలానా డివిజన్లు కావాలని రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్న సదరు అధికారులు.. కమీషన్ల వసూళ్లలోనూ తమదైన ముద్రవేస్తున్నారన్న ఆరోపణ ఉంది.

అప్లికేషన్​ వచ్చిందంటే వారికి పండగే..

గణాంక విభాగంలోనూ పైరవీలకు పెద్దపీట వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పర్సంటేజీలు ఇచ్చిన దస్త్రాలు ముందుకు కదులుతున్నాయి. ముందు పెట్టిన ఫైలు కాకుండా మామూళ్లు ఇచ్చిన వారి దస్త్రాలకు ఓకే చెబుతున్నారు. రెవెన్యూ విభాగంలోనూ ఇంటి నెంబర్ కోసం ఓ బిల్ కలెక్టర్ దగ్గరకు దరఖాస్తు వచ్చిందంటే పండగే అన్నట్లుంది. ఒక్కో దరఖాస్తుకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

నాణ్యత నవ్వుతోంది

బల్దియాలో అధికారుల తీరు ఇలా ఉంటే తామేమీ తక్కువ కాదన్నట్లు గుత్తేదారులు వ్యవహరిస్తున్నారు. అధికారులు అడిగిన పర్సంటేజీలు ముట్టచెబుతున్న గుత్తేదారులు అభివృద్ధి పనుల్లో నాణ్యతను గాలికొదిలేస్తున్నారు. ఫలితంగా నగరంలో నాసిరకం పనులతో అభివృద్ధి మూణ్నాళ్లముచ్చటగానే ఉంటోంది. చాలాచోట్ల పనుల్లో నాణ్యత లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. కొత్త రహదారి నిర్మాణ పనులకు ఇసుకకు బదులు డస్ట్ వాడుతున్నారు. ఎక్కడా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఫలితంగా కొద్దిరోజులకే అభివృద్ధి పనుల్లో డొల్లతనం బయటపడుతుంది.

పర్సంటేజీ ఇచ్చిన వాళ్లు ఊరుకుంటారా..!

గుత్తేదారులంతా జట్టు కట్టి మరీ అభివృద్ధి పనులు పంచుకుంటున్నారు. సిండికేట్ గా మారి అభివృద్ధి పనుల కాంట్రాక్టు పనులు చేపడుతున్నారు. గతంలో టెండర్లు 30 శాతం లెస్ ఉంటే.. ప్రస్తుతం 5 శాతమే ఉంటున్నాయి. అధికారులు, గుత్తేదారుల మధ్య క్రిడ్ ప్రో కో కారణంగానే లెస్ టెండర్లు పడుతున్నాయి. అందుకే అభివృద్ధి పనులను మమ అనిపిస్తూ గుత్తేదారులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారంటే అందుకు అధికారుల తెరవెనుక పాత్రే కారణమన్న వాదన ఉంది. కొంతమంది గుత్తేదారుల ఇష్టారాజ్యం బల్దియాలో సాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. పనులకు సంబంధించిన ఎంబీలు ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్​కు సిబ్బంది పంపాల్సి ఉన్నా.. నేరుగా గుత్తేదారులే ఎంబీ దస్త్రాలు పట్టుకుని కార్యాలయంలో తిరుగుతుండటం వారి ఇష్టారాజ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిస్థితి నగరంలో జరిగే అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావమే చూపుతుంది.

ఇప్పటికైనా స్పందించాలి

ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకవర్గం చొరవ చూపి నగరపాలక సంస్థలో ఇష్టారాజ్యంగా సాగుతున్న కొంతమంది అధికారులు, గుత్తేదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అవినీతిని సంహించేది లేదు

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (minister puvvada ajay kumar) సహకారంతో నగరం శరవేగంగా అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఇతర నగరాలు, పట్టణాలు ఖమ్మం వైపు చూసేలా నగరం అభివృద్ధిలో సాగుతుంది. ఈ పరిస్థితుల్లో నగరపాలక (khammam municipality) సంస్థలో కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారన్న అంశం మా దృష్టికి వచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతికి కొమ్ముకాసే చర్యలను ఉపేక్షించేది లేదు. పర్సంటేజీల వసూలు చేస్తున్న వారిపై చర్యలు తప్పవు.-పునుకొల్లు నీరజ, ఖమ్మం నగర మేయర్

ఇదీ చూడండి:Revanth reddy on paddy procurement: 'ధాన్యం కొనకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉరి తప్పదు'

ABOUT THE AUTHOR

...view details