కోటి ఆశలతో వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతాంగం ఏ విత్తనం మంచిది ఏ విత్తనం నాణ్యంగా ఉంటుంది. ఏ సమయంలో విత్తనం వేసుకోవాలి. వేసుకున్న విత్తనం మొలకెత్తేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నకిలీ, నాసిరకం విత్తనాలు ధరిచేరకుండా ఎలాంటి అప్రమత్తతతో ఉండాలన్న అంశాలను ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హేమంత్ కుమార్తో ఈనాడు - ఈటీవీ భారత్ ముఖాముఖి.
1. ప్రస్తుతం సీజన్ ఎలా ఉంది. ఉమ్మడి జిల్లాలో కావాల్సిన వర్షపాతం నమోదైందా ?
జ. హేమంత్ కుమార్ : ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో రైతులు వానాకాలం సాగుకు ముమ్మరంగా సన్నద్ధమవుతున్నారు. ఖమ్మం జిల్లాలో వర్షపాతం జూన్లో 105 ఎంఎం పడాల్సి ఉండగా 185 ఎంఎం నమోదైంది. 70 నుంచి 75 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం పత్తి, పెసర పంటలకు అనుకూలంగా ఉంటుంది. రైతులు అన్ని పంటలకు విత్తనాలు వేసుకోవచ్చు. ఈ సీజన్లో విస్తీర్ణం 5.18లక్షల ఎకరాలు ఉండగా.. ఇప్పటి వరకు 1.2 లక్షల ఎకరాల్లో సాగు మొదలుపెట్టారు. మెట్ట పంటల సాగుకు ఇంకా చాలా సమయం ఉంది.
2. జిల్లాలో నమోదైన వర్షపాతంతో ఏయే పంటలకు విత్తనాలు వేసుకోవచ్చు. ఏయే పంటల విత్తనాలు వేయకూడదు ?
జ. హేమంత్ కుమార్ : జిల్లాలో సాగయ్యే ప్రధాన పంటలు నాలుగు ఉన్నాయి. 2.3 లక్షల ఎకరాల్లో వరి, 2.43 లక్షల ఎకరాల్లో పత్తి, 20 వేల హెక్టార్లలో మిర్చి సాగు చేసే వీలుంది. ఈ సమయంలో వర్షాధారంగా సాగుచేసే పంటలు మొదలు పెట్టవచ్చు. పత్తి జూలై 20 వరకు విత్తుకోవచ్చు. జూలై 15 వరకు పెసర సైతం విత్తుకోవచ్చు. ఆగస్టు మాసం వరకూ కంది విత్తనాలు కూడా వేసుకోవచ్చు. జూలై 15 వరకు వరి మధ్యకాలిక 130, 135 రకాలు రోజులవి ఎంచుకోవాలి. ప్రాజెక్టుల కింద నీటి రాక ఆలస్యమయ్యే వారు 120, 125 రకాలను ఎంచుకోవాలి. మిర్చికి ఇంకా సమయం ఉంది. జూలై మధ్య నుంచి కానీ ఆఖరు నుంచి నార్లు పోసుకుని ఆగస్టులో నాట్లు వేసుకోవాలి. రైతులు తొందరపడకుండా పూర్తిస్థాయిలో భూములు చదును చేసుకున్న తర్వాతే విత్తనాలు వేసుకోవాలి.
3. విత్తనమే సాగుకు మూలాధారం. మరి విత్తన ఎంపికలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
జ. హేమంత్ కుమార్ : విత్తన ఎంపిక చేసుకోవడం ముఖ్యమైన అంశం. విత్తనం బాగుంటేనే పంట బాగుంటుంది. అధిక దిగుబడులు వస్తాయి. అత్యధిక విస్తీర్ణంలో పత్తి సాగవుతుంది కనుక రైతులు మరింత జాగ్రత్తగా విత్తనం ఎంపిక చేసుకోవాలి. ఏ హైబ్రిడ్స్ తో అధిక దిగుబడులు సాధించారో అలాంటి వాటినే ఎంచుకోవాలి. వర్షాధారంగా సాగు చేసే రైతులు సన్నరకాలు, నీటి పారుదల అవకాశం ఉన్న రైతులు లావు రకాలు ఎంచుకోవాలి. ఎండు తెగులును తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. WRG-65 రకం, ICPL-87119, మారుతి-8863 రకాలను ఎంచుకుంటే బాగుంటుంది. పెసరలో పల్ల ఆకు తెగులును తట్టుకునే విత్తనాలు ఎంచుకోవాలి.
5. విత్తనం విత్తిన తర్వాత మొలకెత్తే దశలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని ఎలా అధిగమించాలి ?