ఉమ్మడి ఖమ్మం జిల్లాపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. వేసవి ప్రారంభమైన రోజుల్లోనే భగభగలాడుతూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు పెరిగినందున ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.
భానుడి భగభగలు.. ఠారెత్తిస్తున్న ఎండలు - summer started in khammam
భానుడు పగబట్టినట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రతి రోజు అక్కడక్కడా గాలి దుమారం, అకాల వర్షాలు పడుతున్నాయి. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున జనం ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.
ఖమ్మం జిల్లాలోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లల్లో శనివారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం కూసుమంచిలో అత్యధికంగా 42.2 డిగ్రీలు నమోదైంది. ముదిగొండ మండలం బాణాపురంలో 40.2, వైరా, ఖమ్మం గ్రామీణ మండలం పల్లెగూడెంలో 39.9, ముదిగొండ మండలం పమ్మి, నేలకొండపల్లిలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా 25.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో నమోదైంది.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో శనివారం అత్యధికంగా 41.9 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. కరకగూడెంలో 40.8, చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులో 40.3, ఆళ్లపల్లి తహసీల్దార్ కార్యాలయం, గుండాల పోలీస్ స్టేషన్‌లో 40.2 డిగ్రీలు నమోదయ్యాయి. అశ్వారావుపేటలో 25 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.