తెలంగాణ

telangana

ETV Bharat / state

నిండు గర్భిణీని 100 కిలోమీటర్లు నడిపించిన లాక్​డౌన్​ - Lockdown effect on pregnant woman

అసలే మొదటి కాన్పు. నిండు గర్భిణీ. ఇలాంటి పరిస్థితుల్లో కడుపులో బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే... చాలా జాగ్రత్తగా మెలగాలి. పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం. అడుగు తీసి అడుగు వేసేందుకు కూడా ఆచితూచి వ్యవహరించాలి. కానీ.. కష్టాల కాపురం ముందు తన కష్టం లెక్క కాదనుకుంది ఓ గర్భిణీ. కాలినడకన ఏకంగా 500 కిలోమీటర్ల ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. కరోనా కాటుతో.. మానవాళి ఎదుర్కొంటున్న తీరని కష్టాలకు తార్కాణంగా నిలుస్తోందీ ఒడిశాకు చెందిన ఓ నిండు గర్భిణీ కష్టాల ప్రయాణం.

A pregnant woman walking 100 kilometers due to lock down effect
100 కిలోమీటర్లు నడిచిన నిండు గర్భిణీ

By

Published : Apr 22, 2020, 3:46 PM IST

Updated : Apr 22, 2020, 11:29 PM IST

ఒడిశాలోని మల్కాన్​గిరి జిల్లా దామన్​పల్లికి చెందిన సునీత శీల్ బతుకు దెరువు కోసం మూడు నెలల క్రితం భర్త శ్రీరామ్ శీల్, సమీప బంధువు సుశాంత్ బైరాగ్​తో కలిసి హైదరాబాద్​కు వచ్చారు. కుటుంబ పోషణ కోసం భర్త సెంట్రింగ్ పనుల్లో చేరాడు. ఈ నెలాఖరులోగా సెంట్రింగ్ పనులు పూర్తి చేసుకుని కాన్పు కోసం ఇంటికి వెళ్లాలనే నిర్ణయంతో ఉన్న సునీత కుటుంబ సభ్యులకు కరోనా కష్టాల్ని తెచ్చిపెట్టింది. లాక్​డౌన్ పొడిగించడం, హైదరాబాద్​లో ఉపాధి లేకపోవడం.. కుటుంబ పోషణ భారమైంది. ఈ పరిస్థితుల్లో ఇక హైదరాబాద్​లో ఉండి లాభం లేదనుకున్న కుటుంబీకులు.. సొంత ఊరు ఒడిశా రాష్ట్రంలోని దామన్​పల్లికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు.

కాలినడకన..

ఎలాంటి రవాణా సదుపాయం లేకపోవడం వల్ల కాలినడకన సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని ఊరికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి కాలినడకన బయలుదేరారు. చాలా దూరం కాలినడకన ప్రయాణించిన తర్వాత గర్భిణీగా ఉన్న సునీత కష్టాలు చూసిన ఓ లారీ డ్రైవర్.. వారికి సూర్యాపేట వరకు లారీలో తీసుకొచ్చాడు. మళ్లీ అక్కడి నుంచి నుంచి కాలినడకన ప్రయాణం కొనసాగించారు.

చలించిపోయిన అధికారులు..

సూర్యాపేట నుంచి ఖమ్మం, భద్రాచలం మీదుగా ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్​గిరి జిల్లాకు వెళ్లేందుకు కాలినడకన ప్రయాణం సాగిస్తున్న వీరు ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపానికి చేరుకున్నారు. రోడ్డుపై కాలినడకన నిండు గర్భిణీ నడవడం గమనించిన రెవెన్యూ, పోలీస్ అధికారులు.. వారి వివరాలు సేకరించారు. ఒడిశాకు కాలినడకన బయలుదేరామన్న గర్భిణీ మాటలు విని చలించిపోయారు. అభాగ్యులను చేరదీసే ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్​కు సమాచారం అందించారు. వెంటనే అంబులెన్స్ ద్వారా కూసుమంచి చేరుకున్న అన్నం శ్రీనివాసరావు బృందం... గర్భిణీతో పాటు ఆమె కుటుంబీకులను ఖమ్మం తీసుకొచ్చారు. గర్భిణీని ఆస్పత్రిలో చేర్పించారు.

నిలకడగా గర్భిణీ ఆరోగ్యం..

నిండు గర్భిణీ దాదాపు 100 కిలోమీటర్లు కాలినడకన నడిచించిందని తెలుసుకున్న వారంతా... వారి దయనీయతను చూసి కన్నీరుమున్నీరయ్యారు. గర్భిణీని పరిక్షించిన వైద్యులు... చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. లాక్​డౌన్​తో తీరని ఇబ్బందుల్లో ఉన్న వలస కూలీల కష్టాలకు ఈ కుటుంబం పడ్డ ప్రయాణ కష్టాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిండు గర్భిణీ దాదాపు 100 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది.

ఇవీ చూడండి: పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

Last Updated : Apr 22, 2020, 11:29 PM IST

ABOUT THE AUTHOR

...view details