భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో సాగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం కన్నుల పండువగా సాగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రాముల వారికి సుగుణాల రాశి సీతమ్మకు జరిగే కల్యాణ మహోత్సవానికి ముందురోజు జరిగే ఎదుర్కోలు వేడుక ఆద్యంతం వైభవోపేతంగా సాగింది.
నిరాడంబరంగా ఎదుర్కోలు...
వేదమంత్రోచ్ఛారణలు, వేద పండితుల ప్రతి సంభాషణల మధ్య వీనుల విందుగా సాగింది. కరోనా ప్రభావంతో ఆలయ పరిసరాల్లో భక్తుల జయజయధ్వానాలు, శ్రీరామ నామస్మరణలు లేనప్పటికీ ఎదుర్కోలు మహోత్సవం వైభవోపేతంగా సాగింది. బేడా మండపంలో ఎదురెదురుగా శ్రీరాములవారు, సీతమ్మ తల్లి ఆశీనులు కాగా వేదపండితులు, అర్చకులు పోటాపోటీగా సీతారాముల వారిని కీర్తించారు.
వధూవరుల వంశ కీర్తి ప్రతిష్ఠల్ని వివరించారు. చూడచక్కని వాడు ప్రపంచానికి ఆనందం పంచేవాడు రామచంద్రుడని రామయ్య తరఫు పురోహితులు కీర్తించగా సుగుణాల రాశి, అయోనిజ సీతమ్మ వల్లే రామయ్యకు కీర్తి ప్రతిష్ఠలంటూ సీతమ్మ తల్లి తరఫు అర్చకులు కీర్తించారు.