seatbelts saves family members in Khammam district : ఖమ్మం జిల్లా వైరా మండలం పినపాక వద్ద రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక కుటుంబాన్ని ఎయిర్ బ్యాగులు కాపాడాయి. కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో 6 ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ఐదుగురు ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా సీటు బెల్టు ధరించడంతో ప్రమాద సమయంలో అన్ని ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయ్యాయి. ఎయిర్ బ్యాగులు ఓపెన్ కాకుంటే ఆ కారులో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఈ కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ స్పృహ కోల్పోయి కారులో నిస్తేజంగా ఉండటంతో ఆమె మృతి చెందిందని అందరూ భావించారు. అయితే ఆమెకు వెంటనే రోడ్డుపై వెళ్తున్న ఓ కారు డ్రైవర్ సీపీఆర్ చేసి పునర్జన్మను ప్రసాదించాడు. వైరా మండలంలోని స్టేజి పినపాక గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ సంగతి:ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం సమీపంలోని సింగుపురం గ్రామానికి చెందిన ఆటకేశం అనే వ్యక్తి వరంగల్ ఎస్బీఐ బ్యాంకులో పని చేస్తున్నాడు. అతడి చిన్నమ్మ అనారోగ్యంతో కన్ను మూసింది. ఆమెను చివరి చూపు చూసేందుకు ఆటకేశం వరంగల్ నుంచి తన భార్య సునీత, కుమారుడు సాత్విక్, కుమార్తె జాన్విత, తల్లి నాగరత్నంతో కలిసి కారులో బయలుదేరాడు. వైరా మండలం స్టేజి పినపాక గ్రామ సమీపంలోని ఇండియన్ ఆయిల్బంక్ వద్ద రహదారిపై ఉన్న స్పీడ్ బ్రేకర్ల వద్ద వైరా నుంచి తల్లాడ వైపు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న కారు ఆ టిప్పర్ను ఢీకొట్టింది. టిప్పర్ వెనక భాగంలోని బంపర్లో కారు ఇరుక్కుపోవటంతో సుమారు 200 మీటర్ల దూరం కారును ఈడ్చుకొని వెళ్లింది.