Bathukamma Festival in Telangana: అందమైన యువతులు.. రంగురంగుల పూలు.. బతుకమ్మ పాటలు.. ఆడపిల్లల నృత్యాలు.. విద్యాసంస్థల్లో కనిపించిన దృశ్యాలివి. బతుకమ్మ పండుగ పురస్కరించుకుని.. కళాశాలలు, పాఠశాలల్లో ముందస్తు వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లిలోని ప్రైవేటు పాఠశాలలో.. బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. విద్యార్థినులు, ఉపాధ్యాయులు కలిసి వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చారు.
యువతల దాండియా నృత్యాలు: పాఠశాల ఆవరణలో బతుకమ్మ పాటలకు కోలాట నృత్యాలను ప్రదర్శించారు. జగిత్యాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు పాఠశాలల్లో విద్యార్థినిలు, ఉపాధ్యాయులు ఆడిపాడారు. హనుమకొండలో ముందస్తు బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఉపాధ్యాయులతో కలిసి ఆడిపాడారు.