తెలంగాణ

telangana

ETV Bharat / state

Karimnagar Bridges: శిథిలావస్థకు కల్వర్టులు... ముందకు సాగని పనులు - Karimnagar road works

Karimnagar Bridges: జగిత్యాల- కరీంనగర్ మీదుగా కోదాడ వరకు రహదారిని విస్తరించాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. రోజురోజుకూ ట్రాఫిక్‌ పెరుగుతున్నా... రోడ్డువిస్తరణ మాత్రం జరగడం లేదు. భూసేకరణ కారణంగా ప్రక్రియ ఆలస్యమవుతుండగా... ఈ రహదారిలో కల్వర్టులు ప్రమాదకరంగా మారాయి. కల్వర్టులున్న చోట్ల రోడ్డు ఇరుకుగా ఉండడంతో... నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Bridges
Bridges

By

Published : Jan 15, 2022, 5:27 AM IST


Karimnagar Bridges: జగిత్యాల-వరంగల్ రహదారిలో కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన కల్వర్టులు ట్రాఫిక్‌కు అనుగుణంగా వెడల్పు చేయకపోవడంతో... వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జగిత్యాల వైపు నుంచి ఖమ్మం, వరంగల్ వెళ్లాల్సిన వాహనాలన్నీ... ఈ మార్గంలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. నిజామాబాద్ నుంచి రోజు దాదాపు 120 ట్రిప్పుల బస్సు సర్వీసులు... వరంగల్‌ వరకు ప్రయాణిస్తాయి. సరుకులు తీసుకెళ్లే లారీలతో పాటు గ్రానైట్‌ లారీలు ఈ మార్గంలో వందలాదిగా వెళ్తుంటాయి. దీంతో కల్వర్టు వద్ద రోడ్డు ఇరుకుగా ఉండడంతో రద్దీ ఏర్పడుతుంది. ఈ రోడ్డును జాతీయ రహదారిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించి మూడేళ్లు కావస్తోంది. కానీ విస్తరణకోసం చేపట్టాల్సిన భూసేకరణ వివాదాస్పదం కావడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది.

శిథిలావస్థకు కల్వర్టులు...

కేంద్రం జాతీయ రహదారిగా ప్రకటించడంతో రాష్ట్రప్రభుత్వం మరమ్మతులను నిలిపివేసింది. రోడ్డంతా గోతులమయంకాగా... కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ రహదారిలో శ్రీరాంసాగర్ కాల్వతో పాటు వరదకాల్వ, దిగువ మానేరు జలాశయం నుంచి వరంగల్‌ వైపు నీటిని తరలించే కాకతీయ కెనాల్‌ కారణంగా... ఆరు ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా వెళ్తుంది. జగిత్యాల సమీపంలో గట్టుదుద్దెనపల్లి, ఈదులగుట్టపల్లి వద్ద కల్వర్టులు ప్రమాదకరంగా మారాయి. ఈ ప్రాంతాల్లో బస్సులు లారీలు కల్వర్టులు దాటుతున్న క్రమంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

త్వరలో ప్రారంభం..

రోడ్డు పనులు ప్రారంభం కాకపోయినప్పటికీ మరమ్మతులు చేయిస్తున్నామంటూ అధికారులు సమాధానాన్ని దాటవేస్తున్నారు. త్వరలో జాతీయ రహదారి పనులు ప్రారంభమవుతాయని చెబుతున్నా... మూడేళ్లుగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details