కరీంనగర్‌లోని మానేరు నదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి నగరానికే సరికొత్త శోభను తీసుకువచ్చింది. మూడేళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా... పనులు వేగంగా జరుగుతున్నాయి. పూర్తిగా విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా వంతెనను తీర్చిదిద్దుతున్నారు. ఈ వంతెన కరీంనగర్- వరంగల్ మధ్య ట్రాఫిక్ రద్ది తగ్గించటంతోపాటు పర్యాటకులకు ఆహ్లాదం కలిగించనుంది.
మానేరు నదిలో పడవ ప్రయాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో... రెండు వైపులా 220 మీటర్ల ఎత్తులో పైలాన్లు నిర్మిస్తున్నారు. పైలాన్లను 136 సెగ్మెంట్లతో అనుసంధానించే ప్రక్రియ పూర్తికాగా... మరో రెండు నెలల పాటు అప్రోచ్ రోడ్ల నిర్మాణం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత వంతెనను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
ఈ ఏడాది చివరికల్లా తీగల వంతెన నిర్మాణం పూర్తి చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 2020 నాటికే నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా... కరోనా, వర్షాల కారణంగా ఆలస్యమైంది. తొలుత 143 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించినా.... మార్పులు చేర్పులతో వ్యయం 183 కోట్లకు చేరింది. ప్రధానంగా కరీంనగర్ నుంచి వరంగల్, హైదరాబాద్ వెళ్లే వాహనాలు... కేవలం అల్గునూరు బ్రిడ్జిపై నుంచి వెళుతున్నాయి. అందువల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు తీగల వంతెన నిర్మాణం చేపట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న తీగల వంతెన కరీంనగర్ నగరానికే తలమానికంగా నిలుస్తోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.