తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆటోనడుపుతూ.. కుటుంబాన్ని పోషిస్తూ... - eenadu

ఆడదానివి ఆటో నడపడం ఏంటి? మా పరువు తీస్తున్నావ్‌.. అన్నారు కొంతమంది. మగరాయుడిలా ఆటో నడుపుతూ... ఊరుమీద తిరుగుతోందని గుసగుసలాడారు మరికొందరు. ఎవరేమన్నా... ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఇలా ఆటో నడపడానికి ఎన్నో పరిస్థితులున్నాయంటోంది. కాలం కాటేసినా... గుండె నిబ్బరం చేసుకుని ముందుకు సాగుతున్న ఆ వనిత గురించి మనమూ తెలుసుకుందాం!

Woman running auto in karimnagar

By

Published : Aug 14, 2019, 11:24 AM IST

ఆటోనడుపుతూ మహిళ జీవనం

ప్రేమించింది. పెద్దలను ఎదిరించింది. ఇష్టపడ్డ ప్రియున్నే వివాహం చేసుకుంది. ప్రేమకు గుర్తుగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటిదాకా బానే ఉన్నా.... పాప పుట్టగానే భర్తకు కులం గుర్తొచ్చింది. భార్యను కాదన్నాడు. ఇంట్లో నుంచి గెంటేశాడు. అత్తింటివారు వేధించారు. ఆమె కుంగిపోలేదు... ధైర్యంగా ముందుకు సాగింది. అలాంటి వాడితో కాపురం కన్నా... సొంతంగా బతకాలనుకుంది. నచ్చిన పనిని ఎంచుకుని శభాష్ అనిపించుకుంటోంది.

కరీంనగర్ సుభాష్​ నగర్​కు చెందిన సంగీత రాణి.. చిన్నతనంలోనే తండ్రికి దూరమైంది. తల్లి రాజవ్వ కూలీపని చేస్తూ ఇద్దరమ్మాయిలను పెంచింది. అదే వీధిలో ఉండే ఓ యువకుడు సంగీతను ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. ఆడపిల్ల పుట్టగానే... కులాలు వేరని అత్తింటివారు వేధించారు. సంగీతరాణికి తెలియకుండా భర్త మరో వివాహం చేసుకున్నాడు. అత్తమామలు అండగా నిలవాల్సిందిపోయి.. ప్రబుద్ధుడికి వత్తాసు పలికారు. భర్తతో బతుకు బండిని నడపలేకపోయింది సంగీతరాణి.

ఆటో డ్రైవర్‌గా మార్చిన పరిస్థితులు

భర్త వద్దనుకుని తల్లి చెంతకు చేరింది. వివాహం కాని సోదరి ఉండటం.. వారికి భారంగా ఉండొద్దని సొంతంగా పని చేసుకుందామనుకుంది. చదువుకోకపోవటం వల్ల ఎవరు పనిలో పెట్టుకోలేదు. అయినా అధైర్యపడలేదు. చిన్నారిని తల్లి దగ్గర వదిలేసి ఆటో నేర్చుకుంది. కొద్దిరోజుల్లోనే రహదారులపై రయ్ రయ్ మంటూ నడిపింది. అద్దెకు తీసుకున్న ఆటోతో ప్రతిరోజు వెయ్యి రూపాయలు సంపాదిస్తోంది. ఖర్చులు 400 పోగా 600 రూపాయలు మిగులుతున్నాయి.

కూతురు చదువు కోసం

లైసెన్స్ లేకపోవటం వల్ల మొదట్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆటోరాణి స్పూర్తిని మెచ్చుకున్న రవాణా అధికారులు లైసెన్స్​తో పాటు ఆటోనూ అందిస్తామని హామీ ఇచ్చారు. కూతురు వైష్ణవి చదువు కోసం ఎంత కష్టాన్నైనా ఎదిరిస్తానని గర్వంగా చెబుతోంది ఆటోరాణి.

ఆత్మబలంతో ముందుకు

ఉదయాన్నే పనులు ముగించుకుని చిన్నారిని పాఠశాలకు పంపించి బతుకుబండి నడపడం మొదలుపెడుతుంది సంగీత. ప్రోత్సాహంతో పాటు కొందరి హేళన భరించాల్సి వచ్చినా ధైర్యం, ఆత్మ బలంతో కూతురి భవిష్యత్తుకి బంగారుబాట వేసేందుకు శ్రమిస్తోంది.

ఇదీ చూడండి: వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...

ABOUT THE AUTHOR

...view details